పాటకు కవిత్వమే ఆక్సిజన్!

పాటకు కవిత్వమే ఆక్సిజన్!

ఏ మంచి పాటను తీసుకున్నా అందులో కవిత్వం గొప్పగా ఉంటుంది. కవిత్వమే పాటనునడిపించే ఇంధనం. కవిత్వం లేని పాట రంజింపజేయడం అరుదు. అలాంటి కవిత్వాన్ని తమ పాటల్లో గొప్పగా పలికించిన పాటకవులు ఎందరో ఉన్నారు. ఇవాళ కొత్తగా కలం పట్టి రాస్తున్న అనేకమంది పాటల రచయితల్లో కవిత్వలోటు స్పష్టంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఆధునిక జానపద పాటల్లో భూతద్దం పెట్టి వెతికినా అణువంతైనా కవిత్వం కనిపించదు. అందుకు కారణం వారికి పాటంటే కవిత్వమని తెలియకపోవడమే. అందుకే ఈ వ్యాసం. పాటలో కవిత్వం పోషించే పాత్రను తెలియజేయడమే ఈ విశ్లేషణ ప్రధాన ఉద్దేశ్యం!

ప్రజల జీవితం ప్రకృతితో పెనవేసుకుని ఉందనే విషయాన్ని ప్రజారచయితలు గమనించాలి. వారి జీవన తాత్వికతను అర్థం చేసుకోవాలి. వారి దైనందిన జీవితంలో పలు విషయాలను కవితాత్మక పోలికలతోనే చెప్తారు. దానిని రచయితలు పట్టుకోవాలి. అందుకోసం ప్రజల మధ్యకు వెళ్లాలి. పరిశీలించాలి. వారి నుండి నేర్చుకోవాలి. చాలామంది వ్యాసానికి బాణీ కట్టినట్టుగా జీవంలేని పాటలను రాస్తుంటారు. అది అభాసుపాలు చేస్తుంది తప్ప, ప్రజల గుండెల్లో నిలిచిపోదు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెట్టేవాళ్లకు ఎలాంటి సాహిత్య పరిచయం లేకపోయినా... ‘ఇలాంటి సాహిత్యాన్ని నా జీవితంలో చూడలేదు. నువ్వు గొప్ప తురుం, తోపు రచయితవు’ అని పొగడ్తల వర్షం కురిపిస్తుంటారు. వాటిని నిజమనుకునే రచయితలు ఖాళీ చెంచాతో ఆ పూటకు కడుపు నింపుకుంటూ ఉంటారు. 

పాటను దేదీప్యమానంగా వెలిగించేది కవిత్వమే. చిక్కటి కవిత్వంతో రాసే పాట ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. అది పదికాలాల పాటు నిలిచిపోతుంది. చరిత్రలో అలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి. 

చరిత్ర వెలిగించిన కవితాత్మక పాటలు

చరిత్రలో కొన్ని పాటలను పరిశీలిస్తే.. పాటకు కవిత్వం ఎంత లైఫ్​ను ఇస్తుందో అర్థమవుతుంది. ‘‘పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే’’అని రాసిన పాటలో గద్దర్ వర్ణించిందంతా కవిత్వమే. ఆ పొద్దుతిరుగుడు పువ్వు తొలిపొద్దును ముద్దాడే అని ఆగకుండా అడవిలో వెన్నెలమ్మా ఆకుల ముద్దాడే అంటాడు. ఇట్లా ప్రకృతిలో ఉన్న కవిత్వాన్ని అర్థం చేసుకున్నాడు గద్దర్. అందుకే ఈ పాట నిండా ప్రకృతి కవిత్వమే అల్లుకుని ఉంది. ఏ విషయాన్నైనా రచయితలు పాటల్లో చెప్పాలనుకున్నప్పుడు సాధారణంగా చెప్తే అది రక్తికట్టదు. దానిని సరైన పోలికతో చెప్పినప్పుడు అది శ్రోతల హృదయాలను తాకుతుంది. 

‘‘యుద్ధంలో వీరులను తుపాకీ ముద్దాడే, ఆ తూటాలు ముద్దాడి ఒరిగిన అమరులను భూమి ముద్దాడే, రణ భూమి ముద్దాడే’’అంటాడు ఇదే పాటలో. వీరులు పోరాటంలో చనిపోయారనో, నేలకొరిగారనో అలవోకగా చెప్పలేదు. గొప్ప భావుకతతో వారిని తూటాలు ముద్దుపెట్టుకున్నాయని, అలాగే నేల రాలిన వారిని ఆ యుద్ధభూమి కూడా ముద్దుపెట్టుకుందన్నాడు కవి. ఇదీ కవిత్వం.
 
ప్రజల జీవితమే కవిత్వం!

గోరటి వెంకన్న పాటల్లో పదపదాన కవిత్వమే కనిపిస్తుంది. 
‘‘కంచెరేగి తీపివోలే లచ్చుమమ్మో...’’అని శ్రమైక జీవన సౌందర్యానికి పట్టం కట్టిన పాట ఇది. ఇందులో వెంకన్న చాలా గొప్ప కవిత్వాన్ని పలికించాడు.
‘‘పారే యేటి అలల మీద పండువెన్నెల రాలినట్టు
ఊరె ఊట సెలిమెలో లోన తేట నీరు పారినట్టు
వెండి మెరుపుల నవ్వునీదో లచ్చుమమ్మో

నీదెంత సక్కని రూపమే ఓ లచ్చుమమ్మ” అంటాడు. ఇందులో కవి లచ్చుమమ్మ నవ్వును పండువెన్నెలతోటి, ఊరె ఊట సెలిమెతోటి పోల్చాడు. నిజానికి ఇంతటి ఉదాత్తమైన పోలికలు భావికవిత్వంలో మాత్రమే మనం చూడగలం. సామాజిక గీతం అనగానే మన రచయితలు కళాత్మక హృద్యమైన పోలికలు రాయలేకపోతారు. ఇదే పాటలో ‘లచ్చుమమ్మ కాలుమోపితే పల్లేరు ముండ్లు కూడా మల్లెలు అవుతాయి’ అంటాడు. ఇంతగొప్ప ఊహ ఈ రచయితకు ఎలా వచ్చిందోనని ఆశ్చర్యం కలుగుతుంది. అట్లా కవిత్వాన్ని పలికిస్తేనే అది గొప్ప పాటవుతుందని గుర్తించాలి. అలాగే వరుస కరువులు వచ్చినప్పుడు సమస్త ప్రజాజీవితం ఇబ్బందుల పాలయ్యింది. ఆ దుఃఖాన్ని ప్రముఖ వాగ్గేయకారుడు జయరాజు పాట ‘‘వానమ్మ...వానమ్మా’’లో చూడొచ్చు.

‘‘కొంగున నీళ్లు తెచ్చే నింగిలో మబ్బులేవి
సెంగుసెంగున ఎగిరే చెరువుల్లో చేపలేవి

తెల్లాని కొంగబావ కళ్లల్లో ఊపిరేది” అంటూ కరువు దైన్యాన్ని కండ్లకు కట్టాడు. ఇందులో కవి పలికించిన కవిత్వాన్ని పరిశీలిస్తే.. మబ్బులు నీళ్లను తమ కొంగుల్లో తీసుకొస్తాయన్నాడు. సాధారణంగా మబ్బులు నీటితో వచ్చి వర్షాన్ని కురిపిస్తాయి. ఆ ప్రకృతి ధర్మాన్ని గుర్తించాడు కవి. అలాగే చెరువులు ఎండిపోవడంతో దాని మీద ఆధారపడే జీవరాశి ఎదుర్కొనే దుస్థితిని కూడా పట్టుకున్నాడు. చేపలు, కొంగల జీవితం ఎట్లా దుర్భరమయ్యిందో కవిత్వీకరించాడు. ఈ కవి గొప్పతనం ఊపిరిలేని కొంగ కళ్లలోకి చూడడంలోనే ఉంది. అలాగే కొంగను బావ అనడం మనకు చిన్ననాటి కథల్లో ఉంటుంది. అలా కొంగతో మనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశాడు. 

పాటేదైనా కవిత్వమే ప్రాణం!

ఉద్యమ పాటల్లో అంతగా కవిత్వం పలికించలేమనే అభిప్రాయంలో ఉంటారు కొంతమంది రచయితలు. అందుకే వారు కవిత్వం లేకుండా కరపత్రంలా పాటను రాసి ప్రజల మీదికి వదిలేస్తారు. అది అనతి కాలంలోనే కనుమరుగై పోతుంది. 

తెలంగాణ ఉద్యమకాలంలో అమరవీరుల మీద పలు పాటలు వచ్చాయి. వాటిలో నందిని సిధారెడ్డి రచించిన జోహార్లు పాటలో అమరవీరులు ‘తొవ్వ పువ్వుల తీరు’ ఉంటారు అనే గొప్ప పోలికతో చెప్పాడు. ఈ కవి ఏ పాట రాసినా అందులో కవిత్వం జీవధారలా పారుతుంది. అలాగే యువ వాగ్గేయకారుల్లో కోదారి శ్రీనివాస్ పాటల్లో కూడా ఈ రకమైన కవిత్వ గుబాళింపును మనం గమనించవచ్చు. 

‘ముద్దుల రాజాలో కొడుక... ఉత్తరమేస్తున్నో బిడ్డా’అనే పాటలో వలస బతుకుల విషాదాన్ని సజీవంగా పలికించాడు కవి. ఈ పాటలో గొప్ప శిల్పం ఉంది. కూలీ పని కోసం వలసపోయిన కొడుక్కి తల్లి ఉత్తరం రాయిస్తుంది. అందులో తన బతుకును తలుచుకుని వలపోస్తుంది. ‘ఏమీ రాతలురో కొడుకా, ఏట్లో ఈతలురో బిడ్డా’అంటాడు. ఏం రాత అనే మాట జనవ్యవహారికం. జనం ఇప్పటికీ తమ బతుకు మీద విసుగుపుడితే ఇదే మాట అంటారు. అలాగే జీవితం ఎంత కష్టంగా ఉందంటే ఏటిలో ఈత కొట్టినట్టు ఉందని పోల్చాడు కవి. చెరువులోనో, బావిలోనో ఈతకొడితే ఒడ్డుకు చేరొచ్చు. ఏటిలో ఈత ప్రమాదం. జీవితం అంత సాహసోపేతంగా ఉందని పోల్చాడు కవి. 

ప్రతీ యేటా వరదలైపోయే గోదావరి నదిని గురించి బాధపడ్డ కొమిరె వెంకన్న అనే కవి ‘అమ్మా సూడమ్మా బయిలెల్లినాదో... గోదారమ్మా’ అనే పాట రాశాడు. ఈ పాటలో గోదావరి నది తెలంగాణ నేలను చూసి కన్నీళ్లు పెట్టిందని, అలాగే వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసి, ‘‘మళ్లీ జన్మే ఉంటే తిరిగొస్తనందో గోదారమ్మా’’ అంటూ అత్యంత  హృద్యంగా నదికి ప్రాణాన్ని ఆపాదించి, నదే మాట్లాడినట్టు వర్ణించాడు కవి. అలాగే చింతల యాదగిరి అనే కవి ‘‘అమ్మ ఏడ్చింది...’’అంటూ అడవిని తల్లిలా అభివర్ణించాడు. ‘‘ఎందుకే ఓ అమ్మ అంటే ఏమి చెప్పుదు కొడుక అంటూ, అమ్మ ఏడ్చింది’’అని అడవి తల్లి దుఃఖాన్ని తన తల్లి గోసగా పాట గట్టాడు. 

యోచన అనే యువ వాగ్గేయకారుడు కాకి జీవితానికి పట్టం కడుతూ పాట రాశాడు. అందులో ‘కర్మకాండల కాడ పిండాలను ముట్టే, కన్నోళ్ల ఆత్మవి నువ్వమ్మా’ అంటూ కాకి కన్నవాళ్ల ఆత్మ అనే లోకుల భావాన్ని పాటలోకి పట్టుకొచ్చాడు. ఇట్లా కవిత్వంతో పాటలు రాసిన వీళ్లు కొందరే. స్థలాభావం వల్ల అందరి పాటలను వర్ణించలేక మచ్చుకు కొన్ని గుర్తు చేస్తున్నాను. 

కవితాదృష్టే కీలకం

ఏ మంచి పాటను తీసుకున్నా అందులో కవిత్వం లేకుండా ఉండదు. అందుకని యువ రచయితలు పాట రాసేటపుడు కవితాత్మకమైన పోలికలతో రాయాలి. అప్పుడే అది వింటున్న వారి హృదయాలను కదిలిస్తుందని గమనించాలి. ఇందుకోసం మంచి పాటలను, చరిత్రను మలుపుతిప్పిన పాటలను ఎక్కువసార్లు వినాలి. అందులో ఆయా కవులు చేసిన కవితాత్మక ప్రయోగాలను గుర్తించాలి. వాటిని ఆస్వాదించాలి. ఆ ప్రయోగాల గురించి ఆలోచించాలి. తన చుట్టూ ఉన్న జీవితంలో ఎక్కడ కవిత్వం ఉందో పట్టుకోవాలి. ప్రజల జీవితాన్ని ఎన్ని విధాలుగా పోల్చి చెప్పవచ్చో అన్ని విధాలుగా వ్యక్తీకరించాలి. ముఖ్యంగా కొత్త ప్రతీకలతో ఇప్పటివరకు ఏ కవి పోల్చనంత గొప్పగా చెప్పినప్పుడు పాట మరింత నూతనత్వాన్ని అద్దుకుంటుంది. కవిత్వమనే నూనె పోస్తేనే పాటనే దీపం వెలుగుతుంది. ఆ ‘పాట వెలుగులు’ చిమ్మే కాంతిని పంచుతుంది. ఈ లోకంలో చీకటిని తొలగిస్తుంది.

- డా.పసునూరి రవీందర్
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత
77026 48825