చెరువులో చేపలను చంపేందుకు విష ప్రయోగం

చెరువులో చేపలను చంపేందుకు విష ప్రయోగం
  • ఆందోళన వ్యక్తంచేస్తున్న మత్స్యకారులు

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని చౌడు చెరువులో చేపలను చంపేందుకు విష ప్రయోగం చేశారు. ఈ  ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం నంగునూరు గ్రామంలోని చౌడు చెరువులో 183 కుటుంబాలు చేపల పెంపకంపై జీవనం సాగిస్తున్నాయి. ఇటీవల చేపపిల్లలను కొనుగోలు చేసి  చెరువులోకి వదిలారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు మత్తడి సమీపంలో మందు డబ్బాలను నీటిలో కలిపారు.

దీంతో చెరువు నీళ్లు మందులతో కలుషితమై చేపపిల్లలు చనిపోయే ప్రమాదం ఉందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చెరువు నీళ్లు తాగితే గేదెలు, గొర్రెలు, మేకలు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇందుకు  కారణమైన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.