
సత్నా: పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ (పీఓకే) భారత్లో భాగమేనని, దాన్ని వెనక్కి తీసుకోవాలని భారతీయులంతా కోరుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ‘‘మనదంతా ఒకటే ఇల్లు. ఆ ఇంటిలో ఒక గది అక్కడ(పీఓకే)లో ఉంది. దానిలోకి ఎవరో వచ్చి చొరబడ్డారు. ఎప్పటికైనా ఆ గది మనదే. మనకు రావాల్సిందే” అని ఆయన పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్లోని సత్నాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు. భారతీయులదంతా ఒకే భాష అని.. దాని పేరు హృదయ భాష అని పేర్కొన్నారు. భారతదేశమనే ఇంటిలో ఒక రూమ్ పీఓకే అని.. దానిలో అపరిచితులు వచ్చి చేరారని, వాళ్లు ఖాళీ చేయాల్సిందేనని తెలిపారు.
కాగా, పీఓకేలో పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాలుగు రోజుల కింద ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్ భదత్రా సామర్థ్యాన్ని మరింత
పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.