
పారిస్ : పోలెండ్ స్టార్ ప్లేయర్ ఇగా స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. బుధవారం జరిగిన విమెన్స్ రెండో రౌండ్‌లో టాప్‌సీడ్ స్వైటెక్ 7–6 (7/1), 1–6, 7–5తో అన్‌సీడెడ్ నవోమి ఒసాకా (జపాన్)పై చెమటోడ్చి నెగ్గింది. 2 గంటలా 57 నిమిషాల మ్యాచ్‌లో స్వైటెక్ పోరాట స్ఫూర్తి చూపెట్టింది. నిర్ణయాత్మక మూడో సెట్‌లో నవోమి 4–2తో ముందంజలో ఉన్నా పట్టువదలకుండా పోరాడి వరుసగా పాయింట్లు సాధించింది. తన ట్రేడ్ మార్క్ సర్వీస్‌లతో జపాన్ ప్లేయర్‌కు అడ్డుకట్ట వేసి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
ఇతర మ్యాచ్‌లలో ఎనిమిదో సీడ్ ఆన్స్ జుబెర్ (ట్యూనీషియా) 6–-3, 1–-6, 6–-3తో కామిల్లా ఒసోరియో (కొలంబియా)పై, కెనిన్ (అమెరికా) 6-–3, 6–-3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై గెలిచి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. ఇక మెన్స్ సింగిల్స్‌లో 25వ గ్రాండ్ స్లామ్ వేటలో ఉన్న నొవాక్ జొకోవిచ్ తొలి రౌండ్‌లో 6–4, 7–6 (7/3), 6–4తో పియెరి హ్యుగెస్ హెర్బర్ట్ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. రెండో రౌండ్‌లో మూడోసీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–4, 2–6, 6–2తో జెస్పర్ డి జాంగ్ (నెదర్లాండ్స్)పై, ఆరోసీడ్ రబ్లెవ్ (రష్యా) 6–3, 6–4, 6–3తో మార్టినెజ్ (స్పెయిన్)పై, 9వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–3, 6–2, 6–7 (2/7), 6–4తో డానియెల్ అల్టిమెర్ (జర్మనీ)పై నెగ్గారు.