- పీపీఏ ఆఫీస్ రాజమహేంద్రవరానికి తరలింపుపై కూడా..
- బనకచర్ల డీపీఆర్‌పై తెలంగాణ నిలదీసే అవకాశం
హైదరాబాద్, వెలుగు: పోలవరం నిర్మాణ పురోగతిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కీలక సమావేశం నిర్వహించనుంది. వచ్చే నెల 7న హైదరాబాద్‌లోని పీపీఏ ఆఫీసులో 17వ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ఆఫీసున్న కేజీ భవన్ సెకండ్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ రూమ్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు.
పీపీఏ సీఈవో నేతృత్వంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ అధికారులతో పాటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరు కానున్నారు. సమావేశంలో భాగంగా పీపీఏ ఆఫీసును రాజమహేంద్రవరానికి తరలించడంతో పాటు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపైనా చర్చించనున్నారు. మొత్తంగా 14 అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు ఆయా అంశాలను ఎజెండాలో చేర్చారు.
తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలివీ..
పోలవరం ప్రాజెక్టును వాస్తవానికి 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. అయితే, ఆ ఎత్తుతో నిర్మించి పూర్తిస్థాయిలో నీటిని స్టోర్ చేస్తే ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో ముంపు మరో 53,393 ఎకరాలు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరపగా.. ప్రాజెక్టును పూర్థిస్థాయి సామర్థ్యంతో నిర్మించినా కేవలం 41.67 మీటర్ల ఎత్తులోనే నీటిని స్టోర్ చేసేలా కేంద్రం నిర్ణయించింది.
అందుకు అనుగుణంగా 15,277.84 ఎకరాల మేర భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఆ ఎత్తులోనూ నీటిని స్టోర్ చేస్తే మన దగ్గర 6 మండలాల్లోని 954 ఎకరాలు ముంపునకు గురికానున్నాయి. దాంతోపాటు భద్రాచలం టౌన్, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్లకూ ముంపు ముప్పు పొంచి ఉంది. కిన్నెరసాని, ముర్రేడువాగుతో పాటు మరో ఆరేడు స్థానిక వాగుల్లో డ్రైనేజీ తీవ్రత ఎక్కువ అవుతుందన్న ఆందోళన ఉన్నది.
దుమ్ముగూడెం ప్రాజెక్టు కింద 36 వాగులు వచ్చి చేరుతుండడంతో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వాటి డ్రైనేజీ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఈ క్రమంలోనే ముంపునకు సంబంధించి కచ్చితంగా సర్వే చేయించి డీమార్కేషన్ చేయించాలని తెలంగాణ పట్టుబడుతున్నది. కానీ, ఏపీ మాత్రం జాయింట్ సర్వేకు అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ వాదనల్లో నిజం లేదని కొట్టిపారేస్తున్నది.
బనకచర్ల డీపీఆర్‌పైనా..
పోలవరం ప్రాజెక్టుతో పాటు ఏపీ చేపడుతున్న పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుపైనా సమావేశంలో తెలంగాణ అధికారులు లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం తన ఇష్టానికి బనకచర్ల ప్రాజెక్టు డీటెయిల్డ్ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారీకి టెండర్లను పిలిచిన సంగతి తెలిసిందే. టెండర్లు పిలవకుండా ఏపీని నిలువరించాలని గత నెల 10వ తేదీనే పీపీఏతో పాటు సీడబ్ల్యూసీకి ఈఎన్సీ జనరల్ అంజద్ హుస్సేన్ లేఖ రాశారు. అయితే, ఇప్పటి వరకు రిప్లై రాలేదు.
ఈ నేపథ్యంలోనే నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుకు డీపీఆర్‌ను తయారు చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదన్న విషయంపై మీటింగ్‌లో నిలదీసే అవకాశం ఉంది.
