గ్రేటర్ లో కొనసాగుతున్న పోల్స్ సర్వే.. ఇప్పటికే 4.57 లక్షల పోల్స్ గుర్తింపు

గ్రేటర్ లో కొనసాగుతున్న పోల్స్ సర్వే..  ఇప్పటికే 4.57 లక్షల పోల్స్ గుర్తింపు
  • గతంలో లెక్క 5,50,088  
  • మూడు రోజుల్లో సర్వే పూర్తి 
  • కొత్త ఏజెన్సీ కోసం మరో నెలలో టెండర్లు  
  • ఇప్పటికే ఈఓఐలో పాల్గొన్న నాలుగు సంస్థలు


హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో స్ర్టీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను కొత్త ఏజెన్సీకి అప్పగించే పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే స్పెషల్​స్టాండింగ్​కమిటీ నిర్ణయం తీసుకోగా, బల్దియా టెండర్లు వేసేందుకు సిద్ధమైంది. అయితే, కొత్త ఏజెన్సీలకు అప్పగించే ముందు గ్రేటలో ఎన్ని పోల్స్ ఉన్నాయని లెక్క తేల్చేందుకు సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వే ఇప్పటికే 83 శాతం పూర్తి కాగా, 4,57,756  పోల్స్ ఉన్నట్లు  తేల్చింది.  మరో మూడు రోజుల్లో పూర్తి స్థాయి లెక్క తేలనుంది.  

ఇంతకుముందు ఏజెన్సీలకు గ్రేటర్​లో 5,50,088 స్ట్రీట్​ లైట్లు ఉన్నాయని చెప్పి అప్పగించారు. అయితే మరో మూడు రోజుల్లో సర్వేలో తేలే లెక్కను బట్టి కొత్త ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించనున్నారు.  

ఐఎల్ సీ, ఐఎంఎం..

మొత్తానికి కొత్త ఏజెన్సీకి అప్పగించేందుకు నిర్ణయం తీసుకోగా, ఇందులో భాగంగా ఇక నుంచి ఇండివిజ్యువల్ లుమినర్ కంట్రోల్( ఐఎల్ సీ) లేదా ఇంటిగ్రేటెడ్ మినార్ మానిటనింగ్(ఐఎంఎం) సిస్టం అందుబాటులోకి తేచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఐఎల్ సీ ద్వారా ఒక్కో స్ర్టీట్ లైట్ ని నేరుగా మెయింటెయిన్ చేసేందుకు అవకాశముంటుంది. 

ఈ టెక్నాలజీ ద్వారా ఒకేచోట నుంచి ఎక్కడ స్ర్టీట్ లైట్ వెలగకపోయిన తెలుసుకోవచ్చు. అదే ఐఎంఎంతో అయితే  ఒక ఏరియా లేదా కొన్ని లైట్లను కలిపి మెయింటెయిన్​చేయొచ్చు. ఈ రెండింట్లో ఏదో ఒక సిస్టం అమల్లోకి తీసుకురానున్నారు. 

ఈఓఐలో పాల్గొన్న నాలుగు సంస్థలు...

టెండర్లకు ముందే ఈఓఐ(ఎక్స్ ప్రెషన్​ఆఫ్ ఇంట్రెస్ట్)ని జీహెచ్ఎంసీ ఆహ్వానించగా  లిప్స్, క్రాంప్టన్, ఛరిష్మా, స్నెల్ సంస్థలు పాల్గొని కొటేషన్లు అందజేశాయి. ఈఓఐ సమయం కూడా గురువారంతో ముగిసింది. కొటేషన్ల పరిశీలన తర్వాత ప్రి బిడ్ మీటింగ్, పోస్ట్ బ్రిడ్ సమావేశం నిర్వహించి టెండర్లను పిలుస్తారు. టెండర్లలో పాల్గొన్న వారితో పోస్ట్ బ్రిడ్ మీటింగ్ నిర్వహించడంతో పాటు తక్కువ రేట్లు సమర్పించిన వారికి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు.  

ఏడేండ్లు.. బాగుంటే మరో రెండేండ్లు 

కొత్తగా వచ్చే ఏజెన్సీలకు ఏడేండ్లకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. పనితీరు బాగుంటే మరో రెండేండ్లు పొడిగిస్తారు. గతంలో పదేండ్ల పాటు ఈఈఎస్ఎల్ నిర్వహణ బాధ్యతలు చూడగా, ప్రతినెలా రూ.8 కోట్ల వరకు బల్దియా చెల్లించింది. కొత్త ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించినా ప్రస్తుత టెక్నాలజీ, పక్కాగా నిర్వహణ జరగాలంటే ఖర్చు ఇంతకంటే ఎక్కువే అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అంటే, ఏడేండ్లకు సుమారు రూ.1300 నుంచి రూ.1500 కోట్ల వరకు అయ్యే ఛాన్స్​ఉంటుందని అంచనా వేస్తున్నారు.  

మరో మూడు నెలలు..

ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నప్పటికీ మొత్తం ప్రక్రియ పూర్తయి కొత్త ఏజెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు మూడునెలలు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు లైట్ల నిర్వహణను జీహెచ్ఎంసీ చూస్తుంది. జోనల్ స్థాయిలో ఇప్పటికే 1200 ఎల్ఈడీ లైట్లను కొని అవసరమైన చోట ఏర్పాటు చేస్తోంది. ఈ వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇదివరకున్న 17 డీఐఎస్ టీమ్స్ తో లైట్లను మెయింటెన్ చేయనున్నారు.