
బీహార్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్న వేళ.. ఎంఐఎం పార్టీ కూడా తమ క్యాండిడేట్స్ లిస్టును విడుదల చేసింది. ఫస్ట్ లిస్టులో మొత్తం 16 జిల్లాల్లో 32 సీట్ల నుంచి పోటీ చేయనున్నట్లు చెప్పిన పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. ముస్లిం డామినేషన్ ఉన్న స్థానం నుంచి హిందూ అభ్యర్థిని రంగంలోకి దింపడం చర్చనీయాంశంగా మారింది.
ధాకా నియోజకవర్గంలో హిందూ అభ్యర్థిని మోహరించింది AIMIM పార్టీ. రాజ్ పుత్ కమ్యునిటీకి చెందిన రాణా రంజిత్ సింగ్ బుధవారం (అక్టోబర్ 15) నామినేషన్ వేశాడు. తలపై నమాజ్ టోపీ, నుదుట బొట్టు ధరించి హిందూ, ముస్లిం కట్టుబాట్లను రెండింటినీ ప్రదర్శిస్తూ నామినేషన్ వేశాడు.
ఈ సందర్భంగా.. ఐ లవ్ మొహమ్మద్.. జై శ్రీరామ్.. అంటూ నామినేషన్ సెంటర్ నుంచి బయటకు వచ్చాడు రంజిత్ సింగ్. నేను ఇస్లాం ను గౌరవిస్తా.. హిందూ మతాన్ని ఫాలో అవుతా.. అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ధాకా నియోజకవర్గంలో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ హిందూ క్యాండిడేట్ ను దింపడంలో ఎంఐఎం స్ట్రాటజీ ఏంటా అని అందరూ ఆలోచిస్తున్నారు. సెక్యులర్ ఓట్లను చీల్చి బీజేపీకి లాభం చేకూర్చేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2020లో బీహార్ లో 5 స్థానాలు గెలుచుకుంది ఎంఐఎం. ఆ ఎన్నికల్లో ఓట్లు చీల్చడంతో మహాగట్బంధన్ కూటమి అయిన కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల గెలుపుపై ప్రభావం చూపినట్లు విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు.
బీహార్ లో 17 శాతం ముస్లిం పాపులేషన్ ఉన్నా.. వారికి చట్ట సభల్లో సరైన ప్రాతినిథ్యం లేదని ఆరోపిస్తున్నారు అసదుద్దీన్ ఒవైసీ. రాష్ట్రంలో మూడో ఆల్టర్నేటివ్ అవుతామని అంటున్నారు. కానీ బీజేపీకి బీ టీమ్ గా పనిచేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. గత ఎన్నికల మాదిరిగా ఓట్లు చీల్చి ఎన్డీఏకు మేలు చేసే ప్లాన్ చేస్తున్నారని.. కానీ ఈ సారి ఆ పప్పులేం ఉడకవని కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి సభ్యులు అంటున్నారు.