
ప్రపంచ కుబేరుడు, అమెరికా సంపన్న వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచారు. కానీ ఈసారి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్ లింక్ శాటిలైట్లు తోకచుక్కల్లా రాలిపోవటం గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ ఒకటి రెండు స్టార్ లింక్ శాటిలైట్లు భూ వాతావరణంలోకి జారిపడిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వీటి వ్యర్థాలు భూకక్ష్యలో మిగిలిపోవటం భద్రతకు ముప్పు కలిగిస్తుందని వారు చెబుతున్నారు.
ఎలాన్ మస్క్ తన స్టార్ లింక్ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఏకంగా 8వేల శాటిలైట్లను పంపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇవి రాలిపోతుండటం జస్ట్ ప్రారంభమేనని.. రానున్న కాలంలో ఈ సంఖ్య పెరిగితే లో ఎర్త్ ఆర్బిట్ ముప్పుకు గురికావచ్చని ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ సంఖ్య రోజుకు 5 వరకు చేరొచ్చని ఖగోళ శాస్త్రవేత్త జొనాతన్ మెక్డోవెల్స్ అన్నారు. ఒక్కో స్టార్ లింక్ శాటిలైట్ 5 నుంచి 7 ఏళ్లు మాత్రమే పనిచేస్తుందని ఆ తర్వాత సిస్టమ్ ఫెల్యూర్ లేదా సోలార్ యాక్టివిటీతో అవి కక్ష్య తప్పుతాయని తెలుస్తోంది.
పనికిరాని శాటిలైట్లు, రాకెట్ శకలాలతో పాటు ఇతర శిథిలాల సంఖ్య పెరగడం వల్ల భూమి కెస్లర్ సిండ్రోమ్‌కు దగ్గరగా నెట్టబడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యర్థాలు అనుకోకుండా ఢీకొన్నప్పుడు మరిన్ని శిథిలాలకు దారితీస్తాయని ఇదొక చైన్ రియాక్టన్ మాదిరిగా అయ్యే అకాశం ఉందని చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో నింగిలోని కొన్ని ప్రాంతాలను ప్రయోగాలకు ప్రతికూలంగా లేదా వినియోగించుకోవటానికి సురక్షితం కానిదిగా మారుస్తుందని చెబుతున్నారు.
శాటిలైట్ల రాలుడు ఎందుకు..
ప్రస్తుతం స్టాల్ లింక్ ఉపగ్రహాలు భూమికి 340 మైళ్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్ లో తిరుగుతున్నాయి. ఇక్కడ అవి భూ ఆకర్షన శక్తికి 95 శాతం గురవుతుంటాయి. దీని నుంచి తప్పించుకుని అదే ఎత్తులో ఉండటానికి అవి క్రిప్టాన్ లేదా ఆర్గాన్ వాయువుతో నిండిన థ్రస్టర్‌లను మండిస్తుంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు. వాటిలో ఇంధనం పూర్తిగా అయిపోయినప్పుడు సహజంగానే పడిపోతుంటాయని అన్నారు. సదరు ఉపగ్రహాలు పూర్తిగా కాలిపోయేలా స్పేస్ఎక్స్ నిర్మించిందని చెబుతున్నారు. కానీ 2024లో స్టార్ లింక్ మోడెమ్ భాగాలు కెనడాలోని రైతు పొలంలో పడ్డాయి. మస్క్ కంపెనీ అవి పూర్తిగా ఆవిరౌతాయని చెప్పినప్పటికీ అలా జరగలేదు. ఆ తర్వాత కెన్యా, పోలాండ్, నార్త్ కరోలీనా, అల్జీరియా ప్రాంతాల్లో కూడా ఇలాంటి సెకలాలు పడ్డాయి.
ఓజోన్ పొరకు ప్రమాదమే..
రానున్న కాలంలో ఇలాంటి లో ఆర్బిట్ ఉపగ్రహాలను జెఫ్ బెజోస్ ప్రాజెక్ట్ కైపర్ సుమారు 3,200 ప్లాన్ చేస్తుండగా.. చైనాకు చెందిన గువోవాంగ్, క్వియాన్‌ఫాన్ నెట్‌వర్క్‌లు మరో 18వేలు పంపాలని ప్లాన్ చేస్తున్నాయి. 2030 నాటికి లో ఆర్బిట్ ఉపగ్రహాల సంఖ్య లక్షకు చేరుకుని ఆకాశంలో నిండిపోతాయని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంచనా వేసింది. అయితే వీని రాగి, అల్యూమినియం, లిథియం, సీసం వంటివి ఉన్నందున ఓజోన్ పొర దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్పేస్ జంక్ తొలగింపుకు మార్గాలు అన్వేషించే పనులు కొనసాగుతున్నాయి.