క‌ర్నూలు జిల్లాలో ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్న అధికారులు

క‌ర్నూలు జిల్లాలో ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్న అధికారులు

క‌ర్నూలు జిల్లా: ఏపీలోని క‌ర్నూలు జిల్లాలో మంగ‌ళ‌వారం 40 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. రెడ్ జోన్ ప్రాంతాలలో హైవే పెట్రోలింగ్ వాహనాల గస్తీతో జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఎస్పీ.. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెడ్ జోన్ ప్రాంతాలలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించిన‌ ఎస్పీ.. కరోనా కట్టడికి ప్ర‌జ‌లంతా సహాకరించాలన్నారు. భౌతిక దూరం పాటించాలని, కరోనా వైరస్ అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా కట్టుబడి ఉండాలన్నారు.

రెడ్ జోన్ ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ళనుండి బయటకు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక లు జారీ చేశారు. రంజాన్ మాసం సందర్భంగా తెల్లవారు జామున 3 గంటల నుండి.. ముస్లిం ఇళ్లలో సందడి ఉంటుంది కాబట్టి.. అదే సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ నిర్వహిస్తున్నారని తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన‌ వారిపై కఠిన చర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ప్రజలు ఎవరు కూడా అనవసరంగా బయటకు రాకూడదని సూచించారు. నిత్య అవసర సరుకులు ఇళ్ళకే డోర్ డెలివరీ చేపట్టే విధంగా చర్యలు చేపట్టామని .. అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామ‌ని తెలిపారు జిల్లా ఎస్పీ ఫ‌క్కీర‌ప్ప‌.