
పాపన్నపేట, వెలుగు: మంజీరా నదిలో ఇద్దరు యువకులు కొట్టుకుపోతుండగా పోలీసులు, ఫైర్స్ సిబ్బంది కాపాడారు. హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన సాయి, వినయ్ తోపాటు మరో 30 మంది నవరాత్రుల సందర్భంగా పూజలందుకున్న దుర్గామాత విగ్రహాన్ని మంజీరా నదిలో నిమజ్జనం చేసేందుకు ఏడుపాయలకు వచ్చారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో సాయి, వినయ్ కొట్టుకుపోయారు. మార్గమధ్యలో ఉన్న చెట్లను పట్టుకొని ఆగారు.
విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్ గౌడ్ సిబ్బందితో ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. అనంతరం పోలీసులు, ఫైర్ సిబ్బంది రెండు గంటలు శ్రమించి ఇద్దరు యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఘటనా స్థలానికి డీఎస్పీ ప్రసన్నకుమార్ చేరుకొని యువకులను కాపాడిన పోలీస్ ,ఫైర్ సిబ్బందిని అభినందించారు.