
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నేరాల నియంత్రణకు పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దోషులు శిక్షల నుంచి తప్పించుకోకుండా లీగల్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో
ప్రాసిక్యూషన్ తరఫున పక్కా సాక్ష్యాధారాలు సేకరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నుంచి కోర్టు కానిస్టేబుల్ వరకు కేసుల ట్రయల్‌పై మానిటరింగ్ నిర్వహించి, అసలైన దోషులకు శిక్షలు పడేలా కోర్టులో సాక్ష్యాధారాలు ప్రవేశపెడుతున్నారు. దీంతో కోర్టు విచారణల్లో ఉన్న కేసుల్లో ప్రతి ఏటా శిక్షల శాతం పెరుగుతోంది. ఇందులో తీవ్రమైన నేరాల్లో జీవిత ఖైదు,20 ఏండ్లకు తగ్గకుండా కోర్టులు జైలు శిక్షలు విధిస్తున్నాయి. సాధారణ నేరాల్లో కనీసం ఏడాది జైలు శిక్ష పడేలా దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది కోర్టులు రాష్ట్రవ్యాప్తంగా 152 మందికి జీవిత ఖైదు విధించాయి.
ఎక్స్‌పర్ట్స్‌తో స్పెషల్ క్లాస్‌లు
కన్విక్షన్ రేట్ పెంచేందుకు పోలీసులకు లీగల్ అవేర్నెస్ కల్పిస్తున్నారు. నేరాన్ని నిరూపించేందుకు సేకరించాల్సిన సాక్ష్యాధారాలపై లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో స్పెషల్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్‌లో సాక్షాధారాలు సేకరించేందుకు తీసుకోవల్సిన చర్యల గురించి వివరిస్తున్నారు. క్లూస్, ఫింగర్ ప్రింట్స్, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్స్, పోస్ట్‌మార్టంతో పాటు చార్జిషీట్ ఫైలింగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇవే కాకుండా మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. అత్యాచారం, పోక్సో యాక్ట్ కింద నమోదైన కేసుల్లో నిందితులు తప్పించుకోకుండా చర్యలు తీసుకుంటూ వారికి కఠిన శిక్షలు పడేలా పక్కా సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.
కీలకంగా మారిన సైంటిఫిక్ ఎవిడెన్స్
కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో ట్రయల్స్ తొందరగా పూర్తి చేసే విధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. కోర్ట్ హియరింగ్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశిస్తున్నారు. ఇందులో కోర్టు కానిస్టేబుల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను పూర్తిగా భాగస్వాములను చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు దగ్గర్నుంచి చార్జిషీట్ నమోదు చేసేంతవరకు కోర్టు కానిస్టేబుల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ప్రధాన పాత్ర పోషించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాధారణ నేరాలతో పాటు తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్‌ను సేకరిస్తున్నారు. ఇందులో గతేడాది నమోదైన కేసుల్లో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు కీలక కేసులను ఛేదించారు. సాక్ష్యాలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్‌తో కేసుల నిరంతర పర్యవేక్షణ కారణంగా ప్రతి ఏటా శిక్షల సంఖ్య పెరుగుతూ వస్తోంది.