బీజేపీ కార్యకర్తలపై జనగామలో లాఠీఛార్జి

బీజేపీ కార్యకర్తలపై జనగామలో లాఠీఛార్జి

జనగామ జిల్లా పాలకుర్తిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ పార్టీ శ్రేణులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి.. అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిందే. ఈ క్రమంలో బండి సంజయ్ కి పాలకుర్తి PHCలో వైద్య  పరీక్షలు నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలియడంతో.. స్థానిక బీజేపీ నాయకులు ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు. బీజేపీ శ్రేణులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేయడంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. వారిని పోలీసు వాహనాల్లో పీఎస్ కు తరలించారు. పోలీసుల లాఠీ చార్జ్ లో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలైయ్యాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏప్రీల్ 5వ తేదీ బుధవారం పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ సీఎం కేసీఆర్ దిష్టబొమ్మను దహనం చేశారు. ఆయన్ను అకారణంగా అరెస్టు చేశారని,  ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలోని బైంసా, జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్టపల్లి, మంచిర్యాల జిల్లా, వరంగల్ జిల్లాలోని వర్దన్నపేట, నర్సంపేటలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.