ప్రేమ వ్యవహారంలోనే సిద్ధార్థ హత్య

ప్రేమ వ్యవహారంలోనే సిద్ధార్థ హత్య


మోర్తాడ్, వెలుగు: హాసకొత్తూర్ గ్రామంలో మలావత్ సిద్ధార్థ అనే యువకుడిని హత్య చేసిన కేసులో శనివారం ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు ఆర్మూర్ ఏసీపీ రఘు చెప్పారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​జిల్లా కమ్మర్​పల్లి మండలం హాసకొత్తూర్ గ్రామానికి చెందిన కనక రాజేశ్​ చెల్లికి, అదే గ్రామానికి చెందిన మలావత్​ సిద్ధార్థకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయమై సిద్ధార్థను రాజేశ్​రెండుసార్లు మందలించాడు. ఫోన్, మెసేజ్​లు చేయద్దని చెప్పాడు. సిద్ధార్థ వినిపించుకోకపోవడంతో గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల19న రాజేశ్​తన ఫ్రెండ్స్​ధోన్ పాల్ పృథ్వీరాజ్, జంబురత్ అన్వేష్, నండిపేట్ కు చెందిన సల్మాన్, రాకేశ్​ను గ్రామానికి పిలిపించాడు. రాత్రి11 గంటల టైంలో చికెన్ సెంటర్లో పనిచేసే షేర్ల బాలాగౌడ్ అనే యువకుడి ద్వారా సిద్ధార్థకు ఫోన్ చేసి పిలిపించారు. బైక్ పై మెట్ల చిట్టాపూర్ లోని అడవిలోకి తీసుకెళ్లి తాగిన మైకంలో చితకబాదారు. తీవ్రంగా గాయపడిన సిద్ధార్థను గ్రామంలోని పెద్దమ్మ టెంపుల్ దగ్గరకు తీసుకొచ్చారు. శరీరంపైన రక్తం మరకలు తుడిచేసి బట్టలు మార్చి బాలాగౌడ్ కు అప్పగించి వెళ్లారు. ఆయన భోజనం తినిపించి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాడు. తెల్లవారుజామున సిద్ధార్థకు ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో బాలాగౌడ్​రాజేశ్​కు ఫోన్ చేశాడు. వెంటనే రాజేశ్​తన కారులో మెట్ పల్లిలోని ప్రైవేట్​హాస్పిటల్ కు తరలించగా డాక్టర్లు చనిపోయినట్లు ధ్రువీకరించారు. దాంతో హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు కరోనా మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలు పూర్తి చేయాలని ప్లాన్​చేశారు. రూ.11వేలకు అంబులెన్స్ మాట్లాడుకుని బాడీని ప్యాక్​చేసి గ్రామానికి తెచ్చే ఏర్పాట్లు చేశారు. గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ కు ఫోన్ చేసి సిద్ధార్థ కరోనాతో చనిపోయాడని, కుటుంబసభ్యులకు చెప్పి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుని హోదాలో సర్పంచ్ కు సూచించారు. ఆయనను నమ్మించేందుకు గ్రామంలోని ఆర్ఎంపీ మతీన్ తో కొవిడ్ వల్లే చనిపోయినట్లు చెప్పించారు. విషయం మృతుని మేనమామ వసంత్, కుటుంబసభ్యులకు తెలియడంతో అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దాంతో రాజేశ్​డెడ్ బాడీని ఆర్మూర్ లో పోలీసులకు అప్పగించి లొంగిపోయాడు. హత్య కేసులో నిందితులైన కనక రాజేశ్, ధోన్ పాల్ పృథ్వీరాజ్, జంబురత్ అన్వేష్, షేర్ల బాలాగౌడ్, ఆర్​ఎంపీ మతీన్ ను అరెస్ట్ చేశామని, సల్మాన్, రాకేశ్​యాదవ్ పరారీ లో ఉన్నారని పోలీసులు చెప్పారు. 

కేసు విచారణలో అనుమానాలున్నయ్​

సిద్ధార్థ హత్య కేసు విచారణలో చాలా అనుమానాలున్నాయని, నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని, బాధిత కుటుంబానికి అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తామని బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరుతూ ఆదివారం హాసకొత్తూర్ గ్రామంలో మృతుని కుటుంబసభ్యులు, గ్రామస్తులతో కలిసి ధర్నా చేశారు. సిద్ధార్థ తండ్రి అనారోగ్యానికి గురవడంతో రూ. 40 వేల ఆర్థిక సాయం అందించారు. అనంతరం మాట్లాడుతూ హత్య చేసిన విధానం.. తర్వాత జరిగిన డ్రామా.. పోలీస్​స్టేషన్లో నిందితుడికి మర్యాదలు, జైలు లో సెల్ ఫోన్ వాడడం చూస్తుంటే దీని వెనక అధికార పార్టీ అండ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కనక రాజేశ్​కాల్ డేటా తీసి దీని వెనక ఎవరెవరు ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సిద్ధార్థ హత్యపై ఎస్టీ కమిషన్, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.