నిర్మల్​లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా చిక్కింది

నిర్మల్​లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా చిక్కింది

నిర్మల్, వెలుగు: ఒడిశా నుంచి గంజాయి స్మగ్లింగ్​చేస్తున్న ఏడుగురి ముఠాను నిర్మల్​పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ జానకి షర్మిల తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా వట్టపల్లికి చెందిన మెగావత్ రాజు, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ఇస్లాంపూరకు చెందిన షేక్ ఇమ్రాన్ అలియాస్ అర్మాన్, షేరు షాదిక్ షేక్, జాల్నాకు చెందిన బాబూలాల్ దేవ్ చాంద్ జార్డే, ఒడిశాలోని పిలకూస్మికి చెందిన ప్రఫుల్ కుమార్ కిల్లా‌, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన మహ్మద్ ఇలియాస్‌, పందేన నిఖిల్ ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా నిర్మల్ కు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

శుక్రవారం ఉదయం నిర్మల్​లని కొండాపూర్ జంక్షన్ వద్ద మాటువేయగా, పోలీసులు ఊహించినట్లుగానే గంజాయి ముఠా అక్కడికి వచ్చింది. గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాస్, రూరల్ ఎస్సై చంద్రమోహన్ ఆధ్వర్యంలో సిబ్బంది వారిని పట్టుకున్నారు. 24 కిలోల గంజాయి, రెండు స్కోడా కార్లు, బొలెరో వెహికల్, రూ.40 వేలు క్యాష్, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లంతా ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు.