భూమి సాఫ్ చేసేందుకు వెళ్లిన 12 మంది మహిళల అరెస్ట్

భూమి సాఫ్ చేసేందుకు వెళ్లిన 12 మంది మహిళల అరెస్ట్
  • భూమిని సాఫ్ చేసేందుకు వెళ్లిన 12 మంది మహిళలపై కేసు 
  • కోర్టులో హాజరుపర్చిన ఫారెస్ట్​ ఆఫీసర్లు.. 14 రోజుల రిమాండ్
  • గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి ఆదిలాబాద్ ​జైలుకు తరలింపు
  • పట్టాలిస్తామన్న సర్కారు.. కేసులు పెడుతున్న ఆఫీసర్లు 
  • మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడలో ఘటన

మంచిర్యాల, వెలుగు:వానాకాలం సాగు కోసం పోడుభూముల్లో తుప్పలు తొలగించేందుకు వెళ్లిన12 మంది గిరిజన మహిళలపై ఫారెస్టు ఆఫీసర్లు కేసులుపెట్టి జైలుకు పంపారు. మరికొన్ని గంటల్లో రాష్ట్రం ఆవిర్భావ వేడుకలు జరుపుకోనున్న వేళ.. అమాయక గిరిజనులు మాత్రం జైలు పాలు కావాల్సి వచ్చింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట పరిధిలోని కోయపోచగూడ గిరిజనులు అటవీ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని ఫారెస్ట్​ఆఫీసర్లు బుధవారం12 మంది మహిళలను అరెస్ట్​చేశారు. అదే రోజు లక్సెట్టిపేట కోర్టులో గుట్టుగా హాజరుపర్చారు. కోర్టు 14 రోజుల రిమాండ్ ​విధించడంతో అర్ధరాత్రి వారిని ఆదిలాబాద్​జైలుకు తరలించారు. గురువారం గ్రామస్థుల ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. 

రాత్రికి రాత్రే తరలింపు..

కోయపోచగూడ గిరిజనులు 20 ఏండ్లుగా పోడు భూములపై హక్కుల కోసం పోరాడుతున్నారు. తండా శివారులోని అటవీ భూముల్లో తుప్పలు సాఫ్​చేసి పంటలు వేసుకుంటే ఫారెస్టోళ్లు ట్రాక్టర్లతో వచ్చి ధ్వంసం చేస్తున్నారు. కొన్నేండ్లుగా ఇదే తంతు జరుగుతోంది. ఇటీవల మళ్లీ గిరిజనులు పోడు భూములను సాగు చేసుకునే క్రమంలో తుప్పలు, చెట్ల పొదలను తొలగించారు. కవ్వాల్​టైగర్​రిజర్వ్​ఫారెస్ట్​లోకి అక్రమంగా, ఆయుధాలతో ప్రవేశించారని, చెట్లు నరికి అటవీ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని ఫారెస్ట్​ఆఫీసర్లు పలువురిపై కేసులు పెట్టారు.12 మంది మహిళలను బుధవారం అరెస్ట్​చేసి లక్సెట్టిపేట కోర్టులో హాజరుపర్చారు. జడ్జి లక్ష్మణాచారి వారికి14 రోజులు రిమాండ్​విధించారు. మహిళలను అదే రాత్రి ఆదిలాబాద్​ జైలుకు తరలించారు. నిందితుల్లో మద్దికుంట శైలజ, రాజవ్వ, మోర్త సునిత, మొడ్తె పోశవ్వ, సత్తవ్వ, దైనేని లావణ్య, గుడిపెల్లి చిన్నలక్ష్మి, పెద్దలక్ష్మి, దోసండ్ల లచ్చవ్వ, శ్యామల, గంగవ్వ, సునిత ఉన్నారు. వీరిలో పలువురికి చిన్న పిల్లలు ఉన్నారు.  

2003 నుంచి పోరాటం...  

కోయపోచగూడ గిరిజన తండాలో 39 కుటుంబాలు ఉన్నాయి. అందరూ నిరుపేదలే. ఒక్కరికీ గుంట భూమి లేదు. తడకలు అల్లుతూ, కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. 2003లో కొంతమంది గిరిజనులు పోడు భూముల కోసం పోరాటం మొదలు పెట్టారు. మాకులపేట, కోయపోచగూడ శివార్లలోని లింగాపూర్​ఫారెస్ట్​ బీట్ లో చెట్లు కొట్టి పంటలు వేసుకున్నారు. 2009 వరకు ఈ పోరాటం సాగింది. ఫారెస్ట్​ఆఫీసర్లు 2004 నుంచి పలువురిపై కేసులు పెట్టడంతో కోర్టుల చుట్టూ తిరిగారు. కేసుల భయంతో 2009 నుంచి పోడు పోరాటాన్ని నిలిపేశారు. ఇటీవల సీఎం కేసీఆర్​పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించడంతో గిరిజనుల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం నిరుడు డిసెంబర్​లో పోడు భూములకు దరఖాస్తులు స్వీకరించింది. 2005 ముందు నుంచి ఇప్పటివరకు సాగులో ఉన్నవాళ్లే అర్హులని రూల్​పెట్టింది. దీంతో గతంలో వాళ్లు పంటలు వేసుకున్న భూముల్లో మళ్లీ సాగు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫారెస్ట్​ఆఫీసర్లు ఎప్పటిలాగే వాళ్లను అడ్డుకొని కేసులు పెడుతున్నారు. ఇప్పటివరకు కోయపోచగూడకు చెందిన దాదాపు50 మందిపై మూడు నాలుగు కేసుల చొప్పున నమోదయ్యాయి. కోర్టుల చుట్టూ తిరగలేక, బెయిల్​కు సైతం పైసల్లేక గోస పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

నా భార్యను జైలుకు పంపిన్రు 
మాకు గుంట భూమి లేదు. కూలీ పనులు చేసుకుంటున్నం. ఇటీవల చెట్లు కొట్టిన్రని ఆడోళ్ల మీద ఫారెస్టోళ్లు కేసులు పెట్టిన్రు. నా భార్య శైలజను జైలుకు పంపిన్రు. మాకు ఇద్దరు పిల్లలు. మూడేండ్ల కొడుకు తల్లికోసం కలవరిస్తుండు. బెయిల్​కోసం లాయర్ల దగ్గరికి తిరుగుతున్నం. అటవీ భూములు ఇయ్యకుంటే సర్కారు భూములు ఇయ్యున్రి. ఎవుసం చేసుకొని బతుకుతం.   
- మద్దికుంట రమేష్​, కోయపోచగూడ 

2005కు ముందు సాగులో ఉంటేనే... 
అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005కు ముందు నుంచి ఇప్పటివరకు సాగులో ఉన్నవాళ్లకే పోడు భూముల పట్టాలు వస్తాయి. కోయపోచగూడ గిరిజనులు 2004లో అటవీ భూముల్లో సాగు చేసుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడు కేసులు కావడంతో విరమించుకున్నారు. ఆ భూముల్లో ప్లాంటేషన్​చేశాం. ఇటీవల చెట్లు నరికినందునే చట్టప్రకారం కేసులు నమోదు చేశాం.
- రత్నాకర్​రావు, తాళ్లపేట ఎఫ్​ఆర్వో