ఇకపై ఇండ్లలోకి వరద నీరు చేరొద్దు..శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

ఇకపై ఇండ్లలోకి వరద నీరు చేరొద్దు..శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • అధికారులను ఆదేశించిన మంత్రి వివేక్ వెంకటస్వామి 

జూబ్లీహిల్స్, వెలుగు: వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జూబ్లీహిల్స్​నియోజకవర్గం షేక్​పేట డివిజన్​లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సైనీ, అజారుద్దీన్​తో కలిసి హకీంశా కాలనీ, విరాట్ నగర్​నాలాలను పరిశీలించారు. వర్షం కారణంగా వరద నీరు చేరిన ఇండ్లను పరిశీలించారు. 

ఈ సందర్బంగా బాధితులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, సానుకూలంగా స్పందించారు. నాలా సమస్యల పరిష్కారం కోసం ఇంజినీరింగ్ విభాగం అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఇకపై ఇండ్లలోకి వరద నీరు చేరకుండా చర్యలు చేపట్టాలన్నారు. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని స్థానికులకు మంత్రి హామీ ఇచ్చారు. రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, టీపీసీసీ ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్, డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు. 

మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి

జీడిమెట్ల, వెలుగు: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక కృషి చేస్తున్నామని మంత్రి వివేక్​వెంకట స్వామి తెలిపారు. నిజాంపేటలోని రాజీవ్ గృహకల్పలో నల్ల మల్లీస్ ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం వెయ్యి మంది మహిళలకు చీరలు, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్ ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథి హాజరై మాట్లాడారు. 

మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల వడ్డీలేని బుణాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. మహిళలు ఆర్థికంగా ముందు తీసుకెళ్లడంలో భాగంగా మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఏఐ టెక్నాలజీ ద్వారా కార్మికులకు ట్రైనింగ్​ఇప్పించేదుకు ముందుకు వచ్చే వారికి తమ మద్దుతు ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రిని మహిళలు సన్మానించారు. తెలంగాణ రోడ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్​రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు.