
- ఘనంగా పాలకవర్గం 69వ వార్షిక మహాసభ
భీమదేవరపల్లి,వెలుగు : ములుకనూర్ సొసైటీ ఈ ఏడాది రూ. 407 కోట్ల వ్యాపారం చేసిందని, రైతులకు రూ. 242 కోట్లు రుణాలుగా అందించిందని సొసైటీ అధ్యక్షుడు ఎ.ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. రూ. 7.18 కోట్ల లాభాలు రాగా రైతులకు బోనస్‌గా రూ. 3.75 కోట్లను చెల్లించామని చెప్పారు.
పాలకవర్గం 69వ వార్షికోత్సవ మహాసభను శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్ రైస్ మిల్లు ఆవరణలో నిర్వహించారు. ముందుగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు అలిగిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి ఫొటోకు పాలకవర్గం పూలమాల వేసి నివాళులర్పించింది. అనంతరం అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సొసైటి నమ్మకం, క్రమశిక్షణతో విజయవంతంగా 69 ఏండ్లు పూర్తి చేసుకుందని పేర్కొన్నారు.
సంఘ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలు అందించినట్లు వివరించారు. రైతులకు 40 వేల యూరియా బస్తాలు సకాలంలో అందించినట్టు చెప్పారు. పాలకవర్గం అనుమతితో రత్నగిరి, జగన్నాథపూర్‌లో కొత్త గోదాములు, ప్రధాన ఆఫీసులో డైనింగ్హాల్నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీఎం రాంరెడ్డి,ఏజీఎం ఓలాద్రి సతీశ్, మండల ప్రత్యేకాధికారి అనసూయ, ఉపాధ్యక్షుడు వీరయ్య, సభ్యులు పాల్గొన్నారు.