
- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- చండీగఢ్‌లో సీఎస్ఐఆర్, సీఎస్ఐఓ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న ఎంపీ
మహదేవపుర్, వెలుగు: శాస్త్రీయ పరిశోధనల ద్వారా అభివృద్ధి చేసిన స్వదేశీ టెక్నాలజీలు జాతీయ ప్రగతికి, గ్రామీణ పరిశ్రమల ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయని.. స్వదేశీ సాంకేతికతకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం చండీగఢ్‌లో భారత స్వదేశీ ఆవిష్కరణలు, స్వావలంబన దిశగా సాధించిన విజయాలను ప్రతిబింబించేలా సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో పార్లమెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీతో కలిసి ప్రత్యేక అతిథిగా ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. పరిశోధన, పారిశ్రామిక అమలు, పాలసీ రూపకల్పన మధ్య బలమైన అనుసంధానం ఉండాలని, అప్పుడు మాత్రమే దేశ అభివృద్ధి వేగవంతమవుతుందని సూచించారు. గ్రామీణ పరిశ్రమలు, సాధారణ ప్రజలకు నేరుగా ఉపయోగపడే టెక్నాలజీల అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. ప్రదర్శనలో ఆప్టికల్, ఎలక్ట్రో-మెకానికల్ సిస్టమ్స్, హెల్త్‌కేర్ టెక్నాలజీస్, పర్యావరణ పరిశీలన పరికరాలు, స్మార్ట్ సెన్సార్స్, ఆటోమేషన్ వ్యవస్థలు వంటి 200కు పైగా ఆవిష్కరణలు ప్రదర్శించారు. సీఎస్‌ఐఆర్ అధికారులు స్వదేశీ టెక్నాలజీ జాతీయ భద్రతను బలోపేతం చేయడంతో పాటు, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి, నూతన వ్యాపారావకాశాలు, నైపుణ్యాల పెంపు, ఉపాధి సృష్టి సాధ్యమవుతుందని వివరించారు.