చేప పిల్లలకు టెండర్.. మూడు బిడ్స్ దాఖలు చేసిన కాంట్రాక్టర్లు

చేప పిల్లలకు టెండర్.. మూడు బిడ్స్ దాఖలు చేసిన కాంట్రాక్టర్లు
  • మూడు బిడ్స్ దాఖలు చేసిన కాంట్రాక్టర్లు
  • జిల్లాలో 380 ట్యాంకుల్లో 2.20 కోట్ల చేప పిల్లల విడుదలకు ప్రణాళిక
  • వారం, పది రోజుల్లో వదిలేందుకు ఏర్పాట్లు
  • టెక్నికల్ ఇన్స్​పెక్షన్ తర్వాత ఫైనాన్సియల్ బిడ్స్ ఓపెన్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదిలేందుకు మూడు టెండర్లు దాఖలయ్యాయి. గతంలో పలుమార్లు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఆగస్టు 18న ఫస్ట్ ఫేస్ టెండర్లు పిలిచి 31 వరకు గడువు విధించారు. కాంట్రాక్టర్లు స్పందించకపోవడంతో టెండర్ గడువును ఈ నెల 8 వరకు, మళ్లీ 12 వరకు పొడిగించారు. కానీ ఈసారి భీమారం, నీల్వాయి, జగిత్యాలకు చెందిన ముగ్గురు కాంట్రాక్టర్లు బిడ్స్ దాఖలు చేయడంతో అటు మత్స్యకారులు, ఇటు ఫిషరీస్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి హయ్యర్ ఆఫీసర్ల అప్రూవల్ పొందిన తర్వాత వీటిని ప్రకటించారు. కాంట్రాక్టర్లకు సొంత చెరువులు ఉండి జిల్లాలో విడుదలకు అవసరమైన చేప పిల్లలు అందుబాటులో ఉన్న వారికి టెండర్ ఖరారు చేయనున్నారు. ఈ మేరకు నాలుగు రోజుల్లో టెక్నికల్ ఇన్స్​పెక్షన్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తామని అధికారులు తెలిపారు. అనంతరం చేప పిల్లలు పోయడానికి మరో వారం పది రోజుల టైమ్ పడుతుందని పేర్కొన్నారు. 

380 ట్యాంకులు.. 2.20 కోట్ల సీడ్ 

జిల్లాలో చిన్న, మధ్య తరహా, భారీ నీటి వనరులు 380 వరకు ఉన్నాయి. ఈ ఏడాది 2 కోట్ల 20 లక్షల చేప పిల్లలను విడుదల చేయడానికి ఫిషరీస్ ఆఫీసర్లు ప్రణాళిక రూపొందించారు. గతంలో జూలై, ఆగస్టు నెలల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తిచేసి సెప్టెంబర్​లో చేప పిల్లలను విడుదల చేసేవారు. కానీ నిరుడు బాగా ఆలస్యం కావడం వల్ల క్వాంటిటీ తగ్గించారు. ఈసారి కూడా లేట్ కావడంతో సీడ్ పూర్తిస్థాయిలో వేస్తారా లేక గత సంవత్సరం మాదిరిగానే కోత విధిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

నాలుగు రకాల చేపలు

జిల్లాలో ఉన్న నీటి వనరులు నాలుగు రకాల చేపల పెంపకా నికి అనుకూలంగా ఉన్నాయి. ప్రధానంగా బొచ్చె, రవు, మోసు, బంగారు తీగ రకాలను చెరువుల్లో వదులుతున్నారు. ఈసారి కూడా వీటికే ప్రాధాన్యం ఇచ్చారు. 369 చిన్న తరహా ట్యాంకుల్లో 35–40 మిల్లీమీటర్ల చేప పిల్లలు వదులుతారు. ఎల్లంపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు నీల్వాయి, గొల్లవాగు, రాళ్లవాగు సహా 11 మధ్యతరహా, భారీ నీటి వనరుల్లో 80–100 మిల్లీమీటర్ల పిల్లలను వేయనున్నారు. 

ఇవి ఆరు నెలల కాలంలో ముప్పావు నుంచి కిలో వరకు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల గేట్లు ఓపెన్ చేసి ఉండడంతో ఈసారి వీటిలో సీడ్ వేస్తారా లేదా అనేది అనుమానమే. కాగా 30–40 ఎంఎం చేప పిల్లలకు 58 పైసల చొప్పున, 80–100 ఎంఎం చేపకు రూ.1.64 చొప్పున కాంట్రాక్టర్లకు చెల్లించనున్నారు.