శంషాబాద్ ​ఎయిర్​పోర్టులో పోర్టులో 3.5 కిలోల గోల్డ్​ పట్టివేత

శంషాబాద్ ​ఎయిర్​పోర్టులో పోర్టులో 3.5 కిలోల గోల్డ్​ పట్టివేత
  • గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది సహకారంతో స్మగ్లింగ్
  • ముందస్తు సమాచారంతో పట్టుకున్న డీఆర్ఐ అధికారులు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్​ఎయిర్​పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఓ ప్యాసింజర్​దుబాయ్​నుంచి అక్రమంగా తీసుకొస్తున్న మూడున్నర కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్​నుంచి మస్కట్​మీదుగా శంషాబాద్​ఎయిర్​పోర్టుకు చేరుకున్న ఫ్లైట్​లో భారీగా బంగారం ఉందని డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. తనిఖీలు చేసి ఓ ప్యాసింజర్​వద్ద 3.5 కిలోల గోల్డ్​బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

అతను ఇంటర్నేషనల్​ప్యాసింజర్ల గేట్​సమీపంలో పనిచేస్తున్న గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది సహకారంతో గోల్డ్​స్మగ్లింగ్​చేస్తున్నట్లు గుర్తించారు. గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది సాయంతో గోల్డ్​ను పార్కింగ్ ఏరియా దాకా తీసుకెళ్తున్నట్లు తెలుసుకున్నారు. మొత్తం మూడు ప్యాకెట్లలో 30 గోల్డ్​బిస్కెట్లను గుర్తించగా, ఒక్కదానిలో 10 గోల్డ్​బిస్కెట్లు ఉన్నాయి. మొత్తం బంగారం విలువ రూ.3కోట్ల45లక్షల79వేల300 ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడితోపాటు ఇద్దరు గ్రౌండ్ ​హ్యాండ్లింగ్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని కేసు ఫైల్​ చేశారు.