‘బెల్ట్’కు బ్రేకులు!..వరుస దాడులతో లోకల్ వ్యాపారుల బెంబేలు

‘బెల్ట్’కు బ్రేకులు!..వరుస దాడులతో లోకల్ వ్యాపారుల బెంబేలు
  • నిర్మల్​ కలెక్టర్ బదిలీతో మారిన పోలీసుల తీరు  
  • వీడీసీలకు చెల్లించిన సొమ్ముపై ఆందోళన
  • ఎన్నికల వరకు పల్లెల్లో నిలిచిపోనున్న అక్రమ మద్యం అమ్మకాలు

నిర్మల్, వెలుగు : నిర్మల్ కలెక్టర్​గా పని చేసిన వరుణ్ రెడ్డిని ఎన్నికల సంఘం ఆకస్మికంగా బదిలీ చేసిన వ్యవహారం అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేస్తోంది. ముఖ్యంగా పోలీస్, ఎక్సైజ్ శాఖలు కలెక్టర్​పై చర్యలతో ఉలిక్కిపడ్డాయి. దీంతోనే రెండు రోజుల నుంచి పోలీస్, ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులకు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తున్నారు. మద్యం దుకాణాల నుంచి పల్లెల్లోని బెల్ట్ షాపులకు తరలుతున్న మద్యం వాహనాలను సీరియస్​గా అడ్డుకుంటున్నారు. రెండు రోజుల నుంచి జిల్లాలో దాదాపు రూ.20 లక్షలకు పైగా విలువైన మద్యాన్ని బెల్ట్ షాపులకు తరలుతుండగా పోలీసులు పట్టుకున్నారు.

పల్లెలోని బెల్ట్ షాప్​లపై కూడా వరుసగా దాడులు కొనసాగిస్తున్నారు. బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో బెల్టు షాపులకు మద్యం అమ్మొద్దని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని లైసెన్స్ మద్యం దుకాణాల యజమానులకు సైతం అధికారులు వార్నింగ్​ ఇస్తున్నారు. 

సొమ్ము రికవరీపై వ్యాపారుల ఆందోళన..

గ్రామాల్లో బెల్టు షాపును ఏర్పాటు చేసేందుకు విలేజ్ డెవలప్​మెంట్ కమిటీ (వీడీసీ)లు పెద్ద మొత్తంలో వేలం పాటలు నిర్వహిస్తుంటాయి. ప్రతి ఏడాది దసరాకు ముందుగా ఈ వేలం పాటలు కొనసాగుతుంటాయి. ఈసారి ఎన్నికలు ఉండడటంతో కొద్ది రోజుల కింద జరిగిన మద్యం దుకాణం వేలంలో చాలామంది లక్షల రూపాయలు పాట పాడి దుకాణాలను దక్కించుకున్నారు. కానీ రెండు రోజులుగా ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు బెల్ట్ షాప్​లపై దాడులు చేస్తుండడంతో లైసెన్స్ దుకాణాల నుంచి మద్యం సరఫరా నిలిచిపోయింది.

గతంలో బెల్ట్ షాపులతో రాత్రి 12 గంటల వరకు గ్రామాల్లో మందుబాబుల హడావుడి కనిపించేంది. ప్రస్తుతం పోలీసుల చర్యల కారణంగా సాయంత్రం 8 గంటలకే పల్లెలన్నీ సైలెంట్​ అయిపోతున్నాయి. దీంతో తాము వేలం పాటలో చెల్లించిన డబ్బుల సంగతి ఏంటని, తామ సోమ్మును తమకు తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్​ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇదే పరిస్థితి  కొనసాగితే ఎన్నికల వరకు పల్లెల్లో అక్రమ మద్యం అమ్మకాలే ఉండవని పలువురు అంటున్నారు. 

చర్యలు తీసుకుంటాం

ఎట్టిపరిస్థితుల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేయొద్దు. గుడుంబా తయారీ, విక్రయాలు కూడా నడుపొద్దు. చర్యలు కఠినంగా ఉంటాయి. మద్యం విక్రయాలపై గట్టి నిఘా పెట్టాం. ఎక్సైజ్ శాఖతో కలిసి ఉమ్మడిగా తనిఖీలు నిర్వహిస్తాం. వాహనాలనూ తనిఖీ చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నగదును కూడా తరలించవద్దు. 
  
గంగారెడ్డి, డీఎస్పీ, నిర్మల్