ఓట్ల లెక్కింపు : నగరంలో నిషేధాజ్ఞలు

ఓట్ల లెక్కింపు : నగరంలో నిషేధాజ్ఞలు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసి ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.  ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రేటర్‌ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 4వ తేదీ ఉదయం 6గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6గంటల వరకు నిషేదాజ్ఞలు విధిస్తున్నట్టు తెలిపారు పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌. రోడ్లపై ఎక్కువ మంది గుమిగూడడం, ఊరేగింపులను నిషేధించామన్నారు. ఎవరూ ఆయుధాలను కలిగి ఉండరాదని.. చేతిలో కర్రలు, లాఠీలు, పేలుడు పదార్ధాలు, ఇతర ఆయుధాలు కలిగి ఉండరాదన్నారు.

ఊరేగింపులు, గుంపులు గుంపులుగా పోగవడం, సమావేశాలు నిర్వహించడం చేయవద్దాన్నారు. తాత్కాలికంగా ఎక్కడా టెండ్లు వేయడం, స్టేజీలను ఏర్పాటు చేయవద్దని.. మైకులు ఏర్పాటుచేయడం, పబ్లిక్‌ లౌడ్‌ స్పీకర్లను ఉపయోగించరాదన్నారు. రాళ్లను కలిగి ఉండడం, తరలించడం కూడా చేయరాదని.. రోడ్లపైనా, కూడళ్లలో స్పీచులు ఇవ్వడం, ప్రదర్శనలు నిర్వహించడం, ప్లకార్డుల ప్రదర్శనలు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వంటివి చేయరాదని గురువారం పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  పోలీసులు, మిలిటరీ, పారామిలిటరీ, హోమ్‌గార్డులు, ఎన్నికల సిబ్బందిని ఈ ఉత్తర్వుల నుంచి మినహాయించామన్నారు.