తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో డ్రోన్​తో ప్రత్యేక నిఘా : డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో డ్రోన్​తో ప్రత్యేక నిఘా : డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్

కోటపల్లి : తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కోటపల్లి మండలం వేంచపల్లి పెర్రీ పాయింట్ ను గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాసులు, మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ సందర్శించారు. స్థానికులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. డ్రోన్ కెమెరాతో పెర్రీ పాయింట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు

 అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారం తెలుసుకునేందుకు డ్రోన్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతూ.. పోలీసు శాఖ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జనజీవనస్రవంతిలో కలిసి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని వారికి పిలుపునిచ్చారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంత ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటును వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు. సీపీ వెంట జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, చెన్నూర్ ఇన్​స్పెక్టర్ రవీందర్, నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు, కోటపల్లి ఎస్ఐ మహేందర్ తదితరులున్నారు.