
నటనలో శిక్షణ ఇస్తున్న ట్రైనర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ యువతి. హిమాయత్ నగర్ లో వినయ్ వర్మ అనే అతను యాక్టింగ్ లో శిక్షణ ఇస్తున్నాడు. అయితే ట్రైనింగ్ లో భాగంగా.. అమ్మాయిల పైదుస్తులు తొలగించి ట్రైనింగ్ లో పాల్గొనాలని చెప్పాడని తెలిపింది ఆచింత్ కౌర్ చందా. దీంతో పాటే పలు మార్లు అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది. అయితే సదరు వినయ్ వర్మపై నారాయణ గూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా… షీటీం కు ఫిర్యాదు చేయవలసిందిగా పోలీసులు తెలిపారు.
ట్రైనింగ్ లో పైదుస్తులు తీసేయడం సహజం: వినయ్ వర్మ
తనపై వస్తున్న ఆరోపణలపై వినయ్ వర్మ స్పంధించాడు. పైదుస్తులు తీసేసి యాక్టింగ్ ట్రైనింగ్ లో పాల్గొనడం సహజమని అన్నారు. ట్రైనింగ్ లో తనకు 20ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. నటనపై ఇట్రస్ట్ లేకనే.. ఆచింత్ కౌర్ పోలీసులను ఆశ్రయించిందని అన్నారు. తన పై వస్తున్న ఆరోపణలపై న్యాయస్థానంలో తేల్చుకుంటానని చెప్పారు.
వినయ్ వర్మను శిక్షించాలి: బీజేపీ రాష్ట్ర మహిళ కార్యదర్శి
అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న వినయ్ వర్మను కఠినంగా శిక్షించాలని కోరారు బీజేపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి చాయాదేవి. తక్షణమే సదరు యాక్టింగ్ ట్రైనింగ్ సెంటర్ ను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.