
- వరుసగా రెండో నెలలోనూ నెగెటివ్ జోన్‌లో ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: కిందటి నెలలో హోల్‌సేల్ ధరల పెరుగుదలను కొలిచే హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్ట స్థాయి అయిన -మైనస్ 0.58 శాతానికి దిగొచ్చింది. ఆహారం, ఇంధన ధరల్లో డీఫ్లేషన్ (ధరలు తగ్గడం) వల్ల వరుసగా రెండో నెలలో కూడా ప్రతికూల (నెగెటివ్) జోన్‌లో నిలిచింది. గత ఏడాది జులైలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 2.10శాతంగా, ఈ ఏడాది జూన్‌లో మైనస్ -0.13 శాతంగా ఉంది.
ఆహార వస్తువులు (మైనస్ -6.29శాతం), కూరగాయలు (-మైనస్ 28.96శాతం), ఇంధనం, విద్యుత్ (-మైనస్ 2.43 శాతం) సెగ్మెంట్లలో ధరలు భారీగా తగ్గాయి. కూరగాయలు, పప్పులు, గుడ్లు, మాంసం, చేపల ధరల తగ్గుదల వల్ల హోల్‌సేల్ ధరలు భారీగా పడ్డాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) కిందటి నెలలో ఎనిమిదేళ్ల కనిష్టమైన 1.55 శాతానికి పడిన విషయం తెలిసిందే.
అమెరికాలో అంచనాల పైనే..
అమెరికాలో ఈ ఏడాది జులైలో అంచనాలకు మించి హోల్‌సేల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (పీపీఐ) కిందటి నెలలో 0.9 శాతానికి చేరుకుంది. ఇది 0.2 శాతం ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. 2022 జూన్ (0.6 శాతం) తర్వాత ఒక నెలలో పీపీఐ ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి. ఏడాది ప్రాతిపదకన చూస్తే పీపీఐ 12 నెలల గరిష్టమైన 3.3 శాతానికి పెరిగింది. ఫెడరల్ రిజర్వ్ పెట్టుకున్న టార్గెట్ 2 శాతం కంటే పైన ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణ సమస్యలు ఇంకా పోలేదనే విషయం అర్థమవుతోంది.