
ఇండిపెండెన్స్ డే (ఆగస్ట్ 15) ఒకరోజు ముందే.. ఆడియన్స్కు సినిమాల పండుగ మొదలైంది. ప్రసెంట్ బాక్సాఫీస్ వద్ద వార్ 2 vs కూలీ దుమ్మురేపుతున్నాయి. సినిమాల టాక్ ఎలా ఉన్నా.. ప్రేక్షకులు మాత్రం థియేటర్స్కి క్యూ కడుతున్నారు. తమ అభిమాన హీరోల సినిమా కోసం టికెట్లను హాట్ కేకుల్లా బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ నటించిన వార్ 2, రజినీ కూలీ సినిమాలు తొలిరోజు పోటాపోటినా వసూళ్లు సాధించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమాల్లో అత్యంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే బాక్సాఫీస్ క్లాష్ ఇది. మరి ఈ సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు ఎంతో ఓ లుక్కేద్దాం..
వార్ 2:
ట్రాకింగ్ వెబ్‌సైట్ సాక్నిల్క్ ప్రకారం.. వార్ 2 మూవీ 2025లో బాలీవుడ్లో అతిపెద్ద ఓపెనర్గా రికార్డు సృష్టించింది. విక్కీ కౌశల్ బాక్సాఫీస్ హిట్ 'ఛావా' సినిమాను బీట్ చేసి ముందంజలో నిలిచింది. కానీ, రజనీకాంత్ 'కూలీ' సినిమాను మాత్రం వార్ 2 అధిగమించలేకపోయింది.
ఇండియా బాక్సాఫీస్ వద్ద వార్ 2 మూవీ రూ.52.5 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. వాటిలో తెలుగులో నుంచి రూ.23.25 కోట్లు రాగా, హిందీ బెల్ట్ నుంచి రూ.29 కోట్లతో అత్యధికంగా వసూళ్లు చేసింది. ఇక తమిళంలో కేవలం రూ.25 లక్షలు మాత్రమే వచ్చాయి.
ఆక్యుపెన్సీ విషయానికొస్తే, వార్ 2 ఉదయం షోలలో 16.37% ఆక్యుపెన్సీని, మధ్యాహ్నం షోలలో 23.67% ఆక్యుపెన్సీని, సాయంత్రం షోలలో 29% ఆక్యుపెన్సీని మరియు రాత్రి షోలలో 47.90% ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. ఇక ఈ వీకెండ్ వరుస సెలవులు ఉన్నందున కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
మరోవైపు, ఒకేరోజు (ఆగస్ట్ 14న) రిలీజైన రజనీకాంత్ కూలీ మూవీకి ఇండియాలో రూ.65 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇది వార్ 2 మూవీ కంటే (రూ.52.5) అత్యధికం కావడం గమనార్హం. ఈ భారీ సినిమాల మధ్య రూ.12.5 కోట్ల నెట్ వసూళ్ల వ్యత్యాసం ఉందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.
అంతేకాకుండా హిందీ బెల్ట్‌లో కూడా రజినీకాంత్ ఇదే తరహాలో ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. కూలీ తన హిందీ డబ్బింగ్ వెర్షన్ లో రూ.4.5 కోట్ల వసూళ్లు సాధించింది. వార్ 2 మాత్రం తమిళంలో రూ.25 లక్షలు మాత్రమే చేసి వెనుకంజలో ఉంది.