
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కామెంట్
- నెక్లెస్ రోడ్ లో ఉత్సాహంగా తిరంగాయాత్ర
హైదరాబాద్, వెలుగు: భవిష్యత్తులో భారత్ సూపర్ పవర్ అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే దేశభక్తి, జాతీయవాదం అవసరమని అన్నారు. గురువారం నెక్లెస్ రోడ్ లో హర్ ఘర్ తిరంగా యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. భారీ జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల ఇండ్లపై త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశభక్తిని చాటుతున్నామని, రాబోయే తరాలకు ఈ స్ఫూర్తిని అందించాలన్నారు.
దేశాన్ని విడగొట్టి మన దేశ సంపద దోచుకున్న పాకిస్తాన్ కు, ఆ రోజున మతం ఆధారంగా దేశాన్ని విడగొట్టిన బ్రిటిషర్లకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిందని విమర్శించారు. మరోసారి దేశ విభజనకు అవకాశం ఉండకూడదని, ఆ సంకల్పంతో భారతదేశ ఐక్యతను కాపాడేలా తిరంగా యాత్ర చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రాంచందర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రాష్ట్ర నాయకులు జి.మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, మహేందర్ రెడ్డి, శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.