ఆందోళన చేస్తున్న విద్యార్థినిని గిచ్చిన కానిస్టేబుల్..

ఆందోళన చేస్తున్న విద్యార్థినిని గిచ్చిన కానిస్టేబుల్..

చార్మినార్ ఆయుర్వేద హాస్పిటల్ దగ్గర వైద్య విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వైద్య విద్యార్థులపై  పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఆయుర్వేద భవన్ ను ఎర్రగడ్డకు తరలించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్ వ్యాన్ ఎక్కించేందుకు ప్రయత్నించారు.

ఓ మహిళా విద్యార్థి వ్యాన్ లో ఎక్కడానికి నిరాకరించి రోడ్డుపై ఆందోళనను కొనసాగించింది. దీంతో మహిళా పోలీసులు విద్యార్థినిని గుంజుకుని వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో పాటే అక్కడే మఫ్టీలో ఉన్న ఓ మేల్ కానిస్టేబుల్ ఆ విద్యార్థినిని గిచ్చాడు. దీంతో ఆమె విలవిలలాడింది. ఆ మేల్ కానిస్టేబుల్ చేసిన పనికి విమర్షలు వస్తున్నాయి. పోలీసు ఉన్నతాదికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.

ఈ విషయంపై హైదరాబాద్ సౌత్ జోన్ డిసిపి అంబర్ కిషోర్ జా స్పందించారు. చార్మినార్ ఆయుర్వేద హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తున్న ఓ వైద్య  విద్యార్థినిని పట్ల కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించాడని వచ్చిన రూమర్లపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. పోలీసులు ఎవరు కూడా కావాలని అలా చేయరని అయితే అక్కడ ఉన్నది ఎవరన్న విషయాన్ని తాము తెలుసుకుంటున్నామని అన్నారు. మఫ్టీలో ఉన్న పోలీసు అనుకోకుండా అలా ప్రవర్తించాడా.. లేక కావాలనే విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడా అన్న దానిపై విచారణ చేపట్టామని తెలిపారు. కావాలని చేస్తే బాధ్యుడిపై చర్యలు తప్పవని చెప్పారు.