శిల్పాచౌదరి బ్యాంక్ లాకర్ లో ఏం లేవు

శిల్పాచౌదరి బ్యాంక్ లాకర్ లో ఏం లేవు

శంషాబాద్, వెలుగు: కిట్టీ పార్టీలు, ఇన్వెస్ట్ మెంట్ పేరుతో చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరిని ఒకరోజు కస్టడీలో భాగంగా నార్సింగి పోలీసులు మంగళవారం మరోసారి విచారించారు. గతంలో కస్టడీకి తీసుకున్న సమయంలో శని,ఆదివారాలు వరుస సెలవులు రావడంతో బ్యాంక్ అకౌంట్లు పరిశీలించలేకపోయామని, మరోసారి కస్టడీకి అనుమతించాలని నార్సింగి పోలీసులు సోమవారం ఉప్పర్​పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఒకరోజు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం  నార్సింగి పోలీసులు శిల్పాచౌదరిని  కోకాపేటలోని యాక్సిస్ బ్యాంక్ కి తీసుకొచ్చారు. ఆమె బ్యాంక్ అకౌంట్ లాకర్లను ఓపెన్ చేశారు.

ఆ బ్యాంక్ లో శిల్పాచౌదరి అకౌంట్ తెరిచినప్పటి నుంచి చేసిన ట్రాన్జాక్షన్లను, స్టేట్ మెంట్లను పరిశీలించారు.  శిల్పా చౌదరి అకౌంట్​లో డబ్బులు లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. కానీ ఆమె లాకర్ లో సొసైటీకి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్లు దొరకగా.. వాటిని సీజ్ చేశారు. అవి హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్లుగా పోలీసులు భావిస్తున్నారు. లాకర్ లో బంగారం, ఇతర అగ్రిమెంట్ పేపర్లు లేవని బ్యాంకు అధికారులు పోలీసులకు తెలిపారు. బాధితుల నుంచి సుమారు రూ.32 కోట్లు తీసుకున్నట్లు శిల్పాచౌదరి పోలీసుల ముందు ఒప్పుకోవడంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కస్టడీ ముగియడంతో ఆమెను నార్సింగి ఎస్ వోటీ ఆఫీసుకు తీసుకెళ్లారు. బుధవారం ఉదయం ఉప్పర్ పల్లి కోర్టులో శిల్పాచౌదరిని హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.