
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీస్ కేసు నమోదయ్యింది. మచిలిపట్నం ఆర్ఆర్ పేట పోలీస్ స్టేషన్లో సీఐతో వాగ్వాదం విషయంలో ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. సీఐ ఏసుబాబుపై పేర్ని నాని వాగ్వాదానికి దిగి, అసభ్యంగా మాట్లాడి విధులకు ఆటంకం కలిగించారంటూ పేర్ని నాని సహా 29 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. శుక్రవారం ( అక్టోబర్ 10 ) వైసీపీ నేత మేకల సుబ్బన్నను ఓ కేసు విషయంలో స్టేషన్ కు పిలిపించి గంటల తరబడి స్టేషన్లోనే ఉంచడంతో అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు పేర్ని నాని.
సుబ్బన్నపై పెట్టిన కేసుకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలంటూ సీఐతో వాగ్వాదానికి దిగారు పేర్ని నాని. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో స్టేషన్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పకుండా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పేర్ని నాని.. దీంతో సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై సీరియస్ అయిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్ని నాని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎస్పీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని నాని పేర్కొన్నారు. తానెవ్వరిని దూషించలేదని అన్నారు పేర్ని నాని. మేయర్ ను సీఐ రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్లే గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు.