చైన్ స్నాచర్స్ ను పట్టుకునేందుకు గాల్లోకి పోలీసుల కాల్పులు

చైన్ స్నాచర్స్ ను పట్టుకునేందుకు గాల్లోకి పోలీసుల కాల్పులు

ఎల్బీనగర్, వెలుగు: చైన్​స్నాచర్స్​ను పట్టుకునేందుకు పాతబస్తీలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఒక్కసారి ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైదాబాద్, శివశక్తి నగర్ ఏరియాలో సోమవారం ఉదయం ఇద్దరు చైన్ స్నాచర్లు.. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారం గొలుసును తెంపుకుని పారిపోతున్నారు.

 సమాచారం అందుకున్న పోలీసులు, చైన్ స్నాచర్స్ ను పట్టుకునేందుకు వెంబడించారు. చిక్కినట్లే చిక్కి పారిపోతున్న దొంగలను పట్టుకునేందుకు, వాళ్లను భయపెట్టేందుకు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. గాల్లోకి పోలీసులు కాల్పులు జరపడంతో చైన్ స్నాచర్స్ కంగారు పడ్డారు. ఈ సమయంలో పోలీసులు అత్యంత చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడని అమీర్ గా గుర్తించారు. మరొకరి కోసం  గాలిస్తున్నట్లు సైదాబాద్ పోలీసులు  పేర్కొన్నారు.