2 గంటల్లో 3 చైన్​ స్నాచింగ్​లు.. పారిపోతూ పోలీసులకు చిక్కిన ఇద్దరు

2 గంటల్లో 3 చైన్​ స్నాచింగ్​లు.. పారిపోతూ పోలీసులకు చిక్కిన ఇద్దరు

మాదాపూర్, వెలుగు: రెండు గంటల్లో 3 చోట్ల చైన్, సెల్​ఫోన్​స్నాచింగ్​లకు పాల్పడిన ఇద్దరు యువకులు, పారిపోతూ పోలీసులకు దొరికారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్ పురాకు చెందిన షేక్ ఇర్ఫాన్(30) దొంగతనాలు, అక్రమ ఆయుధాలు, రేప్ అండ్ మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2008 నుంచి చైన్ స్నాచింగ్​లకు పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు అతడిపై 19 క్రిమినల్ కేసులున్నాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీసులు ఇర్ఫాన్​పై గతంలో పీడీ యాక్ట్ నమోదు చేశారు. అబ్దుల్లాపూర్​మెట్​లోని జేఎన్ఎన్ఆర్​యూఎం కాలనీకి చెందిన మర్రి నాగరాజు(32) వెహికల్స్ దొంగతనాలు చేసేవాడు. అతడిపై 35 కేసులున్నాయి.

కొంతకాలంగా వీరిద్దరూ కలిసి చైన్ స్నాచింగ్​లకు పాల్పడుతున్నారు. వీరిపై రాయయదుర్గంలో 3, మాదాపూర్​లో 2 కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి 9.30 గంటలకు ఇర్ఫాన్, నాగరాజు స్కూటీపై మాదాపూర్ వైపు వెళ్లారు. అక్కడి మెరిడియన్ స్కూల్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి సెల్​ఫోన్ లాక్కుని పారిపోయారు. తర్వాత నిందితులు మణికొండకు వెళ్లారు. ఓ మహిళ మెడలోని 2 తులాల బంగారు పుస్తెల తాడు, 6 గ్రాముల చైన్, 4 గ్రాముల లక్ష్మీదేవి లాకెట్​ను లాక్కుని పరారయ్యారు. మణికొండ నుంచి ఇర్ఫాన్, నాగరాజు మళ్లీ మాదాపూర్​వైపు వచ్చారు. వెస్ట్రిన్ హోటల్ వద్ద వాకింగ్ చేస్తున్న ఓ మహిళ మెడలో నుంచి 20 గ్రాముల బంగారు చైన్ ను లాక్కుని ఉడాయించారు. బయోడైవర్సిటీ పార్కు వైపు వచ్చిన నిందితులు క్వాల్ కమ్ కంపెనీ వద్ద ఓ మహిళ మెడలోని 7 గ్రాముల బంగారు గొలుసును లాక్కుని వెళ్లారు.

అనంతరం ఖాజగూడ లేక్​ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ వద్ద నుంచి సెల్​ఫోన్​లాక్కొని పారిపోయారు. వరుస చైన్​స్నాచింగ్ ఘటనలతో అప్రమత్తమైన మాదాపూర్ పోలీసులు టీమ్స్​గా ఏర్పడి సెల్​ఫోన్​ సిగ్నల్స్ ద్వారా దర్యాప్తు చేపట్టారు. ఇర్ఫాన్, నాగరాజు గండిపేటలోని పీబీఈఎల్ సిటీ రోడ్​లో వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితులు ఎస్సై రవికిరణ్​పై పెప్పర్ స్ర్రే కొట్టబోయారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ వారిని పట్టుకున్నారు. స్నాచర్ల నుంచి 4 లక్షల 42 వేల విలువైన 3 గోల్డ్ చైన్లు, 3 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చోరీ టైమ్​లో ఎవరైనా ఎదురు తిరిగితే దాడి చేసేందుకు నిందితులు స్కూటీలో పెప్పర్ స్ప్రే, కారంపొడి, రెండు కత్తులను పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్​కు తరలించామన్నారు. 

బషీర్​బాగ్​లో మరో ఇద్దరి అరెస్ట్

బషీర్ బాగ్: తాళాలు వేసిన ఇండ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి భారీగా నగలను స్వాధీనం చేసుకున్నారు. బషీర్ బాగ్​లోని సైబర్ క్రైమ్ పీఎస్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిటెక్టివ్ డిపార్ట్​మెంట్ డీసీపీ శబరీశ్ వివరాలు వెల్లడించారు. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే సుదర్శన్ సింగ్ ఇంట్లో ఈ నెల 4న చోరీ జరిగింది. దీంతో సుదర్శన్​పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీఎస్ స్పెషల్ జోన్ క్రైమ్ టీమ్, మాదన్న పేట్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఓల్డ్ సిటీకి చెందిన వరుసకు అన్నదమ్ములైన మహమ్మద్ షాబాజ్ హుస్సేన్, మహమ్మద్ ఇర్ఫాన్ ను సోమవారం అరెస్ట్ చేశారు.

వీరి వద్ద నుంచి 209 గ్రాముల బంగారం, 1 కేజీ 250 గ్రాముల వెండి, రూ.35 వేలు, రెండు బైకులు, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. షాబాజ్ పై లంగర్ హౌస్, ఖానాపూర్,  ఖమ్మంలో చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితులిద్దరినీ మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.