కర్నాటక డీజిల్‌ హైదరాబాద్​కు స్మగ్లింగ్

కర్నాటక డీజిల్‌ హైదరాబాద్​కు స్మగ్లింగ్

హైదరాబాద్‌, వెలుగు :  కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌ యాప్‌తో డోర్ డెలివరీ చేస్తున్న మినీ ట్యాంకర్స్‌ ‌డ్రైవర్లు ఏడుగురిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.10 లక్షల విలువ చేసే 10,800 లీటర్ల డీజిల్, రూ.35 లక్షలు విలువ చేసే ఏడు మినీ ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కర్నాటకకు చెందిన వ్యాపారి రాధాకృష్ణ హైదరాబాద్​కు డీజిల్ స్మగ్లింగ్‌ చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని డోర్ స్టెప్‌ డీజిల్‌ సర్వీసెస్‌ కంపెనీ ఓనర్ సాయిరామ్ సూర్యకు సప్లయ్‌ చేసేవాడు. ప్రస్తుతం హైదరాబాద్​లో డీజిల్​రేటు లీటర్​కు రూ.95.65 ఉంది. కర్నాటకలో రూ.86.39కి లీటర్ చొప్పున కొనుగోలు చేసి రూ.5 లాభంతో ఇక్కడ రూ.90 నుంచి రూ.91 కి లీటర్​ చొప్పున అమ్ముతున్నాడు.

డోర్‌‌స్టెప్‌ డెలివరీ యాప్‌తో సప్లయ్

డోర్‌‌స్టెప్‌ డెలివరీ యాప్‌లో వచ్చిన ఆర్డర్స్‌ ద్వారా సాయిరామ్‌ డీజిల్‌ సప్లై చేస్తున్నాడు. అతని మేనేజర్ రిషి ఈ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాడు. మినీ ట్యాంకర్లలో నింపి ఇసుక లారీలు, క్వారీ లారీలకు డోర్ స్టెప్ డెలివరీ చేస్తున్నారు. దాదాపుగా ఐదు రూపాయలు తక్కువ ధరకు ఇస్తుండడంతో పలువురు లారీల యజమానులు వీరి నుంచి డీజిల్‌ కొంటున్నారు. గత నెలలో స్మగ్లర్ రాధాకృష్ణ 18,000 లీటర్ల డీజిల్‌ను ట్యాంకర్స్ ద్వారా తరలిస్తూ సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులకు చిక్కాడు. ఎంక్వైరీలో అతను వెల్లడించిన వివరాల ఆధారంగా వట్టినాగులపల్లిలోని ఒక ఓపెన్‌ప్లాట్‌లో 10,800 లీటర్ల డీజిల్, సప్లై చేసే ఏడు మినీ ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లు మహ్మద్ నిజామొద్దీన్‌, షానవాజ్, సయ్యద్‌ఖాన్‌, అమ్మడపల్లి కార్తీక్‌, గాజునూరు శోభన్‌, చింతపల్లి కామేశ్వర్‌‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సాయిరామ్‌ సూర్య, రిషి పరారీలో ఉన్నారు.