మీ సేవా ఉద్యోగి హత్య కేసులో నిందితుడి అరెస్ట్​

మీ సేవా ఉద్యోగి హత్య కేసులో నిందితుడి అరెస్ట్​
  • మీ సేవా ఉద్యోగి హత్య కేసులో నిందితుడి అరెస్ట్​

గోదావరిఖని, వెలుగు:  రామగుండం ఎన్టీపీసీ ప్రాంతంలో మీ సేవా ఉద్యోగిని దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం, గోదావరిఖని సీఐలు కె.లక్ష్మీనారాయణ, రాజ్‌‌కుమార్‌‌ గౌడ్‌‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం సీన్‌‌ రీకన్‌‌స్ట్రక్షన్‌‌ చేసి ఆధారాలు సేకరించారు. ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌‌ షిప్‌‌లోని క్వార్టర్‌‌లో నివాసముండే రాజు సంస్థకు చెందిన హాస్పిటల్‌‌లో కాంట్రాక్టు పద్ధతిన మూడేళ్ల నుంచి స్వీపర్‌‌గా పని చేస్తున్నాడు. అదే హాస్పిటల్‌‌లోని మీ సేవా కేంద్రంలో కాజిపల్లికి చెందిన కాంపెల్లి శంకర్‌‌ ఆపరేటర్‌‌గా చేస్తున్నాడు. శంకర్​భార్య హేమలత ఏడాదిన్నరగా హాస్పిటల్​లో కాంట్రాక్టు నర్సుగా చేస్తోంది. కొంతకాలంగా రాజు, హేమలత మధ్య సాన్నిహిత్యం పెరిగింది. విషయం తెలుసుకున్న శంకర్‌‌ వారిని మందలించాడు. ఆగస్టులో శంకర్‌‌పై హేమలత ఎన్టీపీసీ పోలీస్‌‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేయగా, వారికి కౌన్సెలింగ్‌‌ ఇచ్చి పంపించారు. అయితే హేమలత ప్రవర్తన మారకపోవడంతో శంకర్‌‌ జీర్ణించుకోలేకపోయాడు. గురువారం రాత్రి ఎఫ్‌సీఐ క్రాస్‌‌ రోడ్డులో మద్యం తాగిన శంకర్‌‌ తన భార్యతో చనువుగా ఉంటున్న రాజుతో ఫోన్‌‌లో వాదన పెట్టుకుని టీటీఎస్‌‌లోని అతని ఇంటికి వెళ్లాడు. అదను కోసం చూస్తున్న రాజు మాటల్లోనే పదునైన ఆయుధంతో శంకర్‌‌ తలపై దాడి చేశాడు. దాంతో శంకర్​అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే సర్జికల్‌‌ బ్లేడ్‌‌లను ఉపయోగించి గొంతు కోసి హత్య చేశాడు.

ఒక్కోచోట ఒక్కో పార్ట్..

రాజు గతంలో కొంతకాలం ఆపరేషన్లు చేసేచోట పని చేయడంతో అతనికి శరీరాన్ని ఎలా కోయాలో తెలుసు. దాంతో వీడియోల్లో చూస్తూ సర్జికల్‌‌ బేడ్లతో శంకర్‌‌ శరీరాన్ని మొత్తం ఏడు భాగాలుగా కోశాడు. తల రాజీవ్‌‌ రహదారి పక్కన మల్యాలపల్లి వద్ద, రెండు చేతులను అక్కడికి సమీపంలో పడేశాడు. మొండెం నుంచి మోకాలి వరకు రెండు భాగాలుగా చేసి వాటిని సింగరేణి మేడిపల్లి ఓసీపీ నిర్మానుష్య ప్రాంతంలో, సప్తగిరి కాలనీ కాలువలో వేశాడు. రెండు కాళ్లలో ఒకటి బసంత్‌‌నగర్‌‌ టోల్‌‌ గేట్‌‌ సమీపంలో, మరొకటి గుట్ట ప్రాంతంలో పడేశాడు. ఇలా కోసిన అవయవాలన్నీ ప్లాస్టిక్‌‌ బియ్యం సంచులలో నింపుకొని శంకర్‌‌కు చెందిన టూ వీలర్‌‌పైనే తీసుకెళ్లి విసిరేశాడు. వెహికల్​ను పెద్దపల్లి బస్టాండ్‌‌లో పెట్టి బస్సులో ఇంటికి చేరుకున్నాడు. డెడ్​బాడీని ముక్కలుగా కోసిన తర్వాత రక్తం కారకుండా శరీర భాగాలన్నీ స్పిరిట్‌‌తో కడిగాడు. తర్వాత రక్తం మరకలున్న దుస్తులను, ఇతర వస్తువులను తన క్వార్టర్‌‌లోనే  కాల్చివేశాడు. తన క్వార్టర్‌‌లోని గదులన్నీ కూడా నీళ్ళతో కడిగి ఏమీ ఎరగనట్టుగా డ్యూటీకి వెళ్లిపోయాడు.

తల్లి ఆరోపణలతో కదిలిన డొంక

గురువారం రాత్రి మిస్సింగ్‌‌ అయిన శంకర్‌‌ తల, చేతులు శనివారం కనిపించడంతో మృతుడి తల్లి పోచమ్మ తన కొడుకును కోడలే చంపించిందని ఆరోపణలు చేసింది. దీని ఆధారంగా ఆమెను విచారించిన పోలీసులు రంగంలోకి దిగి రాజును అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శంకర్‌‌ను చంపి ఎక్కడెక్కడ శరీర భాగాలను పడేశాడనే వివరాలు తెలుసుకుని వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌‌మార్టం‌ అనంతరం గోదావరి నది ఒడ్డున ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజుతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.