
హైదరాబాద్, వెలుగు : ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారిని టార్గెట్ చేసిన సైబర్ గ్యాంగ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. వెస్ట్ బెంగాల్ అడ్డాగా సాగుతున్న ఫేక్ కాల్‌సెంటర్ల నెట్‌వర్క్‌ను రాచకొండ పోలీసులు ఛేదించారు. మూడు కాల్ సెంటర్లకు చెందిన తొమ్మిది మందిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. నిందితుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన ముగ్గురు యువకులు ఉన్నారు. నిందితుల నుంచి కారు, రూ.1.62 నగదు, 16 లక్షల డెబిట్ కార్డులు, 39 సెల్‌ఫోన్లు, ఐదు ల్యాప్‌టాప్ లు, రెండు వైఫై రౌటర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.2.88 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఫ్రీజ్ చేశారు. నేరెడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మహేష్ భగవత్ ఈ వివరాలు వెల్లడించారు. బీహార్ లోని కట్రిసరాయ్‌కి చెందిన ఉత్తమ్ కుమార్ యాదవ్ (21) కోల్‌కతాలో 2017లో కాల్‌సెంటర్ ఏర్పాటు చేశాడు. జార్ఖండ్, బీహార్, ముంబై, వెస్ట్ బెంగాల్‌కు చెందిన సైబర్ నేరగాళ్లతో కలిసి ఫేక్ కాల్‌సెంటర్లు నడపాలని ప్లాన్ చేశాడు. డేటా ప్రొవైడర్ల నుంచి కస్టమర్ల ఫోన్ నంబర్లు, అడ్రెస్ కొనుగోలు చేశారు. అలా సేకరించిన నంబర్లకు కాల్స్, మెసేజ్‌లు చేస్తూ ట్రాప్ చేశారు. పర్సనల్ లోన్, ఉద్యోగాలు, లాటరీలు, గిఫ్టులు, కేవైసీ అప్‌డేట్ల పేరుతో ఓటీపీలు తెలుసుకుని ఆన్‌లైన్‌లో కస్టమర్ల సొమ్ము కొట్టేశారు.
ఈ కామర్స్ కస్టమర్లే టార్గెట్
నిందితులు ఈ కామర్స్ కస్టమర్లనే టార్గెట్ చేశారు. ఆన్‌లైన్ ఆర్డర్లను డెలివరీ చేసే బాయ్స్ నుంచి వినియోగదారుల వివరాలు సేకరించారు. ఆ తర్వాత వారి అడ్రెస్‌కు స్క్రాచ్ కార్డులతో ఎన్వెలప్ కవర్స్ పంపించారు. లక్కీడ్రాలో కారు గెల్చుకున్నారని నమ్మబలికారు. దీంతో కస్టమర్లు ఆన్ లైన్ లో తాము షాపింగ్ చేసిన వస్తువులు, డెలివరీ డేట్లతో పూర్తి వివరాలు చెప్పారు. కారు కావాలా, క్యాష్ కావాలా అని నిందితులు ఆఫర్ ఇచ్చారు. తమ మాటలు నమ్మిన వారి వద్ద సర్దీస్ చార్జీలు, జీఎస్టీ, సెక్యూరిటీ డిపాజిట్ సహా వివిధ రకాల చార్జీలు వసూలు చేశారు. ఆ తరువాత నిందితులు తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేశారు.
ఇలా దొరికారు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన కెలోత్ కిషన్ ఈ ఏడాది జూన్‌లో నాప్తోల్ లో షేవింగ్ మెషీన్ ఆర్డర్ చేశాడు. మూడు రోజుల్లో మెషీన్ డెలివరీ అయ్యింది. కొన్ని రోజుల తరువాత నాప్తోల్ ఆన్‌లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కవరింగ్ లెటర్‌తో కిషన్ కు స్క్రాచ్ కార్డ్ వచ్చింది. లక్కీడ్రాలో రూ.8.20 లక్షలు విలువచేసే మహీంద్రా ఎక్స్‌యూవీ కారు గెలుచుకున్నారని ఆ స్ర్కాచ్ కార్డులో నిందితులు పేర్కొన్నారు. 91635 19128 హెల్ప్ లైన్ నంబర్‌కి కాల్ చేయాలని, కారు కావాలంటే కారు లేదా క్యాష్ ఇస్తామని కేటుగాళ్లు కిషన్ ను నమ్మబలికారు. దీంతో ఆ నంబర్ కు కిషన్ కాల్ చేశాడు. టెలీకాలర్లు తెలుగులో మాట్లాడడంతో లక్కీడ్రా నిజమేనని నమ్మాడు. వారు చెప్పినట్లు వివిధ చార్జీల పేరుతో రూ.48 వేలు డిపాజిట్ చేశాడు. ఆ తరువాత హెల్ప్ లైన్ స్విచ్చాఫ్ అయింది. దీంతో బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇన్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బృందాలు కోల్‌కతాకు వెళ్లి గాలించి, మూడు ఫేక్ కాల్ సెంటర్లను ట్రేస్ చేశాయి. పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు.
టెలీకాలర్లలో తెలుగు వారు
టెలీకాలర్లుగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు వంద మందిని నిందితులు రిక్రూట్ చేసుకున్నారు. వారిలో మహబూబ్‌నగర్ జిల్లా గొల్లబండ తండాకు చెందిన ముడావత్ రమేష్ (31), జరుపుల శంకర్ (34), లవుద్య రాజు (19), కట్రావత్ రామ్‌చందర్ (32), వరంగల్‌కు చెందిన చందు(22), మెదక్‌కు చెందిన గాదె శ్రీశైలం (24), ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన కొండా జగన్‌మోహన్ రెడ్డి (25) ఉన్నారు. బీహార్‌కు చెందిన ముఖేష్ కుమార్ (30) మరో రెండు కాల్ సెంటర్లు, పాట్నాకు చెందిన రమేష్ మాలిక్ మరో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. తెలుగులో మాట్లాడే రాష్ట్రాలతో పాటు తమి ళనాడు, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో కస్ట మర్లను నిందితులు మోసం చేశారు. కొట్టేసిన సొమ్ములో టెలీకాలర్లకు 30% కమీషన్‌గా ఇచ్చారు.