తెలంగాణ కిచెన్: ఈ వారం గుమ్మడికాయ స్పెషల్స్.. కారంగా.. పుల్లగా.. తియ్యగా..

తెలంగాణ కిచెన్: ఈ వారం గుమ్మడికాయ స్పెషల్స్.. కారంగా..  పుల్లగా..  తియ్యగా..

ఏ సీజన్​లో ఏ కూరగాయ బాగా దొరుకుతుందో వాటిని వెతికి మరీ వంటింటికి తెచ్చేస్తుంటారు కొందరు. ఎందుకంటే ఆ సీజన్​లో మాత్రమే దొరికే ఆ కూరగాయతో చేసే వంటలు నోటికి కొత్త రుచిని అందిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి గుమ్మడికాయ. దీంతో కారంగా, పుల్లగా, తియ్యగా ఉండే మూడు రుచుల కలయికతో ఈ వారం గుమ్మడికాయ స్పెషల్స్. 

దప్పళం 

కావాల్సినవి :
గుమ్మడికాయ ముక్కలు – రెండు కప్పులు
పచ్చిమిర్చి – రెండు
చింతపండు పులుసు – అర కప్పు
బెల్లం – మూడు టేబుల్ స్పూన్లు
బియ్యప్పిండి – ఒక టేబుల్ స్పూన్
కారం – ఒక టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
ఉప్పు, నీళ్లు – సరిపడా, కరివేపాకు, కొత్తిమీర – కొంచెం
నూనె – రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున, ఎండుమిర్చి – ఒకటి, ఇంగువ – చిటికెడు

తయారీ :
పాన్​లో రెండు కప్పుల గుమ్మడికాయ ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి వేసి నీళ్లు పోసి ఉడికించాలి. గుమ్మడికాయ ముక్కలు ఉడికిన తర్వాత అందులో కారం, ఉప్పు వేసి కలపాలి. ఒక గిన్నెలో చింతపండు వేసి నీళ్లు పోసి నానబెట్టాలి. గుమ్మడికాయ ముక్కల్లో చింతపండు పులుసు వేసి కాసేపు ఉడికించాలి. బెల్లం కూడా వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో బియ్యప్పిండి వేసి, అందులో నీళ్లు పోసి కలిపి ఆ నీటిని కూడా గుమ్మడికాయ మిశ్రమంలో పోయాలి. మిశ్రమం దగ్గర పడ్డాక కొత్తిమీర వేయాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేగించాలి. ఆ తాలింపును గుమ్మడి మిశ్రమంలో వేసి కలపాలి. 

పెసరపప్పు కూర

కావాల్సినవి :
గుమ్మడికాయ ముక్కలు – పావు కిలో, పెసరపప్పు – ముప్పావు కిలో, నువ్వులు – రెండు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి – రెండు, కొబ్బరి – మూడు టేబుల్ స్పూన్లు, పసుపు – పావు టీస్పూన్, ఉప్పు – సరిపడా, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాలింపు దినుసులు – ఒక్కో టీస్పూన్ చొప్పున, కరివేపాకు – కొంచెం

తయారీ :
పెసరపప్పును అరగంటపాటు నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టి పక్కన పెట్టాలి. మిక్సీజార్​లో వేగించిన నువ్వులు, కొబ్బరి, ఎండు మిర్చి, పసుపు, ఉప్పు వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి తాలింపు దినుసులు వేయాలి. తర్వాత కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేగించాలి. నానబెట్టుకున్న పెసరపప్పు, నువ్వుల మిశ్రమం వేసి కలపాలి. అందులో ముప్పావు కప్పు నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. నీళ్లు ఇంకిపోయే వరకు ఉడికిస్తే గుమ్మడికాయ, పెసరపప్పు కూర తినడమే తరువాయి.

బెల్లంతో..

కావాల్సినవి :
గుమ్మడికాయ ముక్కలు – రెండు కప్పులు
బెల్లం – ఒక కప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర – ఒక్కో టీస్పూన్, ఎండు మిర్చి – మూడు
కరివేపాకు – కొంచెం, బియ్యప్పిండి – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – అర కప్పు, నూనె – మూడు టేబుల్ స్పూన్లు, ఉప్పు – సరిపడా

తయారీ :
పాన్​లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసి మూతపెట్టాలి. పదినిమిషాలయ్యాక బెల్లం వేసి కలపాలి. బియ్యప్పిండిలో నీళ్లు పోసి కలపాలి. ఆ నీటిని మిశ్రమంలో పోసి దగ్గరపడేవరకు ఉడికించాలి.