
నిజామాబాద్ జిల్లాలో సంచలనం కలిగించిన నకిలీ పాస్ పోర్టుల స్కాంపై దర్యాప్తు స్పీడందుకుంది. ఈ ఇష్యూలో విమర్శలు రావడంతో.. సర్కారు దర్యాప్తుకు ఆదేశించింది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులే ఇందులో కీలకంగా వ్యవహరించారని బయటపడుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన కొందరు వ్యక్తులు శంషాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారి పాస్ పోర్టులు పరిశీలించిన ఇమ్మినేషన్ ఆఫీసర్లు అవి నకిలీవని తేల్చారు. ఈ ఇష్యూలో ఈ నెల 4న …ఓ ఎస్సై, ఓ ASI తో పాటు.. మరో ఏజెంట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మయన్మార్ కు చెందిన రోహింగ్యాలను బోదన్ వాసులుగా చెబుతూ వారికి పాస్ పోర్టు ఇచ్చారు. రెండేళ్ల క్రితం స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ వీటికి క్లియరెన్స్ ఇచ్చారు. ప్రస్తుతం సిద్దిపేట్ లో ఎస్సైగా పనిచేస్తున్న మల్లేష్ ఇంట్లో అద్దెకున్న ఏజెంట్ ద్వారా 72 పాస్ పోర్టులు జారీ అయినట్టు గుర్తించారు. అందులో ఒకే అడ్రస్ నుంచి 32 పాస్ పోర్టులు జారీ అయినట్టు తేలడంతో అధికారులు కూడా షాక్ అవుతున్నారు.
ఫేక్ పాస్ పోర్టులకు సంబంధించి.. ఎస్సై మల్లేష్ , SB హెడ్ కానిస్టేబుల్ అనిల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఒక ACP స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. బోధన్ పట్టణంలోనే 72 మంది రోహింగ్యాలు పాస్ పోర్టులు పొందారని పోలీసులు గుర్తించారు. అందులో ఆరుగురిని ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేయగా.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. నకిలీ పాస్ పోర్టులు పొందిన మిగతావారు దేశంలో ఉన్నారా..? దేశం దాటి వెళ్లిపోయారా..? అని దానిపైనా ఎంక్వైరీ నడుస్తోంది.
ఫేక్ పాస్ పోర్టు సూత్రధారి పరిమళ్ అని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. పరిమళ్ బంగ్లాదేశీయుడిగా దర్యాప్తులో బయటపడినట్లు చెబుతున్నారు. 2014లో అక్రమంగా కోల్ కతాకు వచ్చిన పరిమళ్ రెండేళ్ల తర్వాత బోధన్ కు మకాం మార్చాడు. అద్దెకు దిగిన ఇంటి యజమానితో రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. దాని ఆధారంగా ఆధార్ కార్డు పొంది ఆపై పాస్ పోర్టుకు దరఖాస్తు చేశాడు. తర్వాత పుణేలో ఉంటున్న తన సోదరుడికి పాస్ పోర్టు ఇప్పించాడు. ఓ ఎస్సై. ASIని మచ్చిక చేసుకొని పరిమళ్ ఈ తతంగం అంతా నడిపించినట్లు బయటపడింది. మొత్తం 72మంది బంగ్లాదేశ్, మాయన్మార్ వాసులకు పాస్ పోర్టులు జారీ అయినట్లు గుర్తించారు. ఆరుగురు మయన్మార్ వాసులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా 66 మంది ఎక్కడ ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. వీళ్లందరు ఇప్పటికే విదేశాలకు చెక్కేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.