బ్లాస్ట్ నిందితుడిని గుర్తించాం.. త్వరలోనే అరెస్ట్ చేస్తం: కర్నాటక సీఎం

బ్లాస్ట్ నిందితుడిని గుర్తించాం.. త్వరలోనే అరెస్ట్ చేస్తం: కర్నాటక సీఎం

బెంగళూరు: రామేశ్వరం కెఫెలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనలో నిందితుడిని గుర్తించామని కర్నాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. నిందితుడిని త్వరలో అరెస్ట్ చేస్తమని తెలిపారు. బ్లాస్ట్ వెనుక ఏ సంస్థ ప్రమేయం ఉందో ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. "మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సు దిగి కెఫెకు వచ్చాడు. రవ్వఇడ్లీని ఆర్డర్ చేసి ఒక దగ్గర కూర్చున్నాడు. తర్వాత బాంబుకు టైమర్ సెట్ చేసి, వెళ్లిపోయాడు. ఆ వెంటనే పేలుడు సంభవించింది. అతడు ఎవరో తెలీదు. సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించాం. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని అరెస్టు చేస్తాం. పేలుడులో గాయపడిన వాళ్లు  ప్రస్తుతం కోలుకుంటున్నారు" అని  సిద్ధరామయ్య వివరించారు. 

బీజేపీ హయాంలో బ్లాస్టులు జరగలేదా..?

కెఫెలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనపై బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు. "ఘటనపై బీజేపీ రాజకీయం చేస్తోంది. వారి హయాంలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయి. అప్పుడు వారు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా..?  టెర్రర్ కార్యకలాపాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనను రాజకీయం చేయొద్దు" అని సీఎం తెలిపారు. కాగా, పేలుడు జరిగిన ప్రాంతాన్ని సిద్ధరామయ్య శనివారం పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

దర్యాప్తును సీసీబీకి అప్పగించినం  

రామేశ్వరం కెఫె పేలుడు కేసు దర్యాప్తును సెంట్రల్‌‌ క్రైమ్‌‌ బ్రాంచ్‌‌(సీసీబీ)కి అప్పగించినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్‌‌ బి.దయానంద వెల్లడించారు. ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు. నలుగురిని మాత్రం విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) ను ఉపయోగించి బ్లాస్ట్ జరిపారని తెలిపారు. కేసు దర్యాఫ్తునకు పలు బృందాలను రంగంలోకి దింపామన్నారు. కేసు సున్నితత్వం దృష్ట్యా నిర్ధారణ చేసుకోకుండా కథనాలు ప్రసారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.