అధిక వడ్డీలు.. అక్రమ ఫైనాన్స్‌లపై పోలీసుల దాడులు

అధిక వడ్డీలు.. అక్రమ ఫైనాన్స్‌లపై పోలీసుల దాడులు
  •     9 మంది అరెస్ట్‌‌.. రూ.12 లక్షల నగదు స్వాధీనం

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అనుమతి లేకుండా అధిక వడ్డీలతో అక్రమంగా ఫైనాన్స్‌‌లు నడిపిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. రెండు రోజులుగా జరిపిన దాడుల్లో తొమ్మిది మందిని అరెస్ట్‌ ‌చేసి వారి నుంచి రూ.12 లక్షల నగదు, 283 బ్లాంక్ చెక్‌లు, 198 బ్లాంక్ ప్రామిసరీ నోట్లు, 16 పాస్‌బుక్‌‌లు, 45 ఏటీఎం కార్డులు, 488 కస్టమర్ లోన్ ఫైల్స్, డైలీ రిజిష్టర్, బ్యాంకు స్టేట్‌మెంట్‌ ఫైల్స్‌, రీసిప్ట్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం సీపీ సత్యనారాయణ ప్రకటన విడుదల చేశారు. అక్రమ ఫైనాన్స్‌, వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై నిఘా పెట్టి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తరువాతే 15 టీమ్‌లతో ఈ దాడులు చేయించినట్లు తెలిపారు. మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆడెపు శంకర్, భూపతి మల్లేశ్‌, ఎంబటి సత్యనారాయణ, గుంట ఐలయ్య, సీహెచ్ తిరుపతి, అగ్గు శ్రీనివాస్, పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మార్కు సదయ్య, గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రం శ్రీనివాస్, మంత్రి శ్యాం సుందర్‌‌ను అరెస్ట్‌ ‌చేసినట్టు సీపీ పేర్కొన్నారు. గతంలో పట్టుబడిన వారు కూడా మళ్లీ ఈ వడ్డీ వ్యాపారం నడిపిస్తున్నారని, వారిపై పీడీ యాక్టు అమలు చేయడానికి రంగం సిద్ధం చేశామని సీపీ తెలిపారు. కమిషనరేట్‌‌పరిధిలో మరికొంత మందిపై నిఘా పెట్టామని, సాక్ష్యాలు సేకరిస్తున్నామని, ఈ వ్యవహారం వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.

ఫైనాన్స్​, హైర్​పర్చేజ్ నిర్వాహకులు వెహికల్స్​ కొనుగోలుకు, వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు ఇచ్చే సమయంలో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుంటున్నారు. బ్యాంకు అకౌంట్ బుక్స్​, ఏటీఎం కార్డ్స్​, చెక్​బుక్స్​ తీసుకోవడమే కాకుండా ప్రాంసరీ నోట్స్​ రాయించుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వందకు రూ.5 నుంచి రూ .10 చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైతే ల్యాండ్​ పేపర్లు, ఇంటి డాక్యుమెంట్లు తీసుకొని అప్పులు ఇస్తున్నారు. బ్యాంకులు లోన్లు ఇవ్వాలంటే పేపర్లు సరిగా ఉన్నాయా లేదా చూసుకొని, ఇద్దరు ముగ్గురిని ష్యూరిటీలుగా పెట్టుకొని ఇల్లు, భూమి, బంగారు ఆభరణాలు మార్ట్​గేజ్ చేసుకుంటాయి. దానికి చాలా రోజుల టైమ్​ పడుతుంది. కానీ ప్రైవేటు ఫైనాన్షియర్లు ఎలాంటి రూల్స్​ పాటించకుండా ఆస్తులను మార్ట్​గేజ్​ చేసుకొని అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు. సకాలంలో తిరిగి చెల్లించకుంటే భూములు, ఇళ్లు, నగలను స్వాధీనం చేసుకుంటున్నారు. అప్పు చెల్లించకపోతే వారిపై దాడులు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

గిరిగిరి దందా…

గిరిగిరి ఫైనాన్స్​ దందా సైతం జిల్లాలో జోరుగా సాగుతోంది. వీరికి ఎలాంటి పర్మిషన్లు ఉండవు. పొద్దున డబ్బులు ఇచ్చి సాయంత్రం వసూలు చేసుకుంటారు. పది నుంచి ఇరవై శాతం చొప్పున వడ్డీలు వసూలు చేస్తున్నారు. జీరో దందా చేసే కమీషన్ ఏజెంట్లు, చిరువ్యాపారులు, ఆటోడ్రైవర్లు, పండ్లు, కూరగాయల వ్యాపారులకు, ఫుట్​పాత్​ బిజినెస్​లు చేసేవారికి మార్నింగ్​ రూ .800 ఇచ్చి సాయంత్రం రూ .వెయ్యి వసూలు చేస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా కేవలం నోటిమాటతో ఈ దందా నడుస్తోంది. దీంతో వీరు ఇన్​కమ్​ టాక్స్​లు, ఇతర పనులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారు.

రికవరీకి బెదిరింపులు…

అప్పుల రికవరీ కోసం ఫైనాన్స్​ల నిర్వాహకులు గుండాలను ఆశ్రయిస్తున్నారు. వసూలు చేసిన మొత్తంపై వీరికి కమీషన్​ చెల్లిస్తారు. ఈ గుండాలు అప్పు తీసుకున్న వారిని బెదిరించడం, అవమానించడం, దాడులు, కిడ్నాప్​లకు సైతం పాల్పడుతున్నారు. వీరి టార్చర్​ భరించలేక పలువురు ఇల్లు విడిచిపోవడం, ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు సైతం ఉన్నాయి. ఈ దందాలో కొంతమంది లీడర్లు, బడాబాబులు ఉండడంతో తమ పలుకుబడిని వాడుకొని చట్టం నుంచి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇవీ రూల్స్​…

ఫైనాన్స్​లు, హైర్​పర్చేజ్​లకు రిజిస్ట్రేషన్​ తప్పనిసరి. ట్యాన్, పాన్ కార్డు ఉండాలి. మనీ లెండింగ్ లైసెన్స్​ తీసుకోవాలి. బ్యాంకు అకౌంట్​ ద్వారానే ట్రాన్జాక్షన్స్​ నడపాలి. ఏటా ఇన్​కమ్​ టాక్స్​ రికార్డులు, ఫైనాన్స్ ఆడిటింగ్ చేయించి సంబంధిత ఆఫీసర్లకు అందజేయాలి. కానీ చాలామంది వీటిని పాటించడం లేదు. ఆర్​బీఐ రూల్స్​, తెలంగాణ మనీ లెండింగ్​ యాక్ట్​ ప్రకారం అక్రమ ఫైనాన్షియర్లు శిక్షార్హులవుతారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో సుమారు 150 వరకు అక్రమ ఫైనాన్స్​లు ఉన్నట్లు సమాచారం.

పంజా విసిరిన పోలీసులు…

కంప్లైంట్స్​ రావడంతో పోలీసులు నిరుడు మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూర్​లలోని పలు ఫైనాన్స్​ సంస్థలపై దాడులు నిర్వహించారు. రెండు జిల్లాల్లో 78 మంది అరెస్ట్ చేసి వారి నుంచి రూ.65.52 లక్షల నగదు, ప్రాంసరీ నోట్స్- 1235,  బ్లాంక్​చెక్స్​-1019,  ఏటీఎం కార్డ్స్-347, బాండ్ పేపర్స్-175, ల్యాండ్ పేపర్స్-23, పట్టా పాస్​బుక్స్-9 స్వాధీనం చేసుకున్నారు. 45 కేసులలో 78 మందిని అరెస్టు చేసి చార్జిషీట్​ ఫైల్​ చేశారు. అయినప్పటికీ ఫైనాన్స్​ల​ ఆగడాలు ఆగలేదు. తాజాగా మూడు రోజుల నుంచి  పోలీసులు మంచిర్యాల, పెద్దపల్లి, గోదావరిఖనిలోని పలు ఫైనాన్స్​లపై రైడ్​ చేసి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రూల్స్​ పాటించని తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారినుంచి రూ.12లక్షల నగదు, 283- బ్లాంక్​చెక్స్​, 198 ప్రాంసరీ నోట్స్, 16 పాస్​బుక్స్​, 45 ఏటీఎం కార్డ్స్​, 488 కస్టమర్ లోన్ ఫైల్స్​ స్వాధీనం చేసుకున్నారు. మరికొంత మందిపై ఎంక్వైరీ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అక్రమ ఫైనాన్స్​ దందా మరోసారి చర్చ జరుగుతోంది.