నిర్వాసితులపై పోలీసులు దాడి అప్రజాస్వామికం

నిర్వాసితులపై పోలీసులు దాడి అప్రజాస్వామికం

నిర్వాసితులపై జరిగిన లాఠీ ఛార్జిపై మంత్రి హరీష్ రావు స్పందించాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరవెల్లిలో నిర్వాసితులపై పోలీసుల లాఠీ ఛార్జీ నేపథ్యంలో బాధితుల సమస్య పరిష్కరించేందుకు మంత్రి హరీష్ రావును కలవాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో పొన్నం ప్రభాకర్ రెడ్డి, కోదండ రెడ్డి.. మంత్రి పి.ఎస్.తో ఫోన్ లోనే సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో లాఠీ ఛార్జి అంశాన్ని లేవనెత్తిన పొన్నం.. మహిళలని కూడా చూడకుండా పోలీసులు దాడిచేసి, గాయపరిచారని వాపోయారు. కానీ ఎస్పీ మాత్రం ఎలాంటి లాఠీ ఛార్జీ జరగలేదన్నడం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే లో గౌరవెల్లిలో చాలా పనులు జరిగాయని ఈ సందర్భంగా పొన్నం గుర్తు చేశారు. అయితే "చిన్న చిన్న సమస్యలను సమర్థంగా  పరిష్కరించి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగు నీరందించవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా ముందుకు వెళ్ళకుండా  ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లుంద"ని పొన్నం తెలిపారు. ఇది ప్రభుత్వానికే నష్టమన్న ఆయన.. బాధితులకు న్యాయం జరగడం కోసం హరీష్ రావును కలుస్తామని స్పష్టం చేశారు. 

నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసులు దాడి చేసి, అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మరో కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలా వాదించిన ఘటనలు లేవన్న ఆయన... న్యాయంగా పరిహారం, అర్ అండ్ అర్ ప్యాకేజీ కావాలని నిర్వాసితులు  కోరుకుంటున్నారని తెలిపారు. అధికారులు తలా ఓ మాట మాట్లాడుతున్నారని..  ఎవరికి గోడు చెప్పుకోవాలో బాధితులకు తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. "పరిష్కారం ఆఫీసర్ల చేతిలో లేదు.. ప్రభుత్వమే పరిష్కరించాలి. మంత్రి చిరవ చూపాల"ని కోదండ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రాజకీయం చేయాలని భావించడం లేదన్న ఆయన... బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.