
- గౌరవెల్లి నిర్వాసితులను రెచ్చగొట్టిన టీఆర్ఎస్ క్యాడర్
- ఇదే అదునుగా ఇష్టారీతిగా కొట్టినపోలీసులు..
- ఒక్కో నిర్వాసితున్ని చుట్టుముట్టి పిడిగుద్దులు
- సొమ్మసిల్లిన ముగ్గురు మహిళలు
సిద్దిపేట, వెలుగు: ప్రశాంతంగా ముగుస్తుందనుకున్న హుస్నాబాద్ బంద్ ఆఖరి నిమిషంలో రణరంగంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా కవ్వించి గౌరవెల్లి నిర్వాసితులను రెచ్చగొట్టారు. వారికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదా న్ని అవకాశంగా మార్చుకున్న పోలీసులు నిర్వాసితులపై విరుచుకుపడ్డారు.
చేతికి దొరికిన కట్టెలు, పైపులు, లాఠీలతో దొరికిన వాళ్లను దొరికినట్లు విపరీతంగా కొట్టారు. టార్గెట్ చేసుకొని మరి కొందరు యువకులను నలుగురైదుగురు పోలీసుల చొప్పున చుట్టుముట్టి ఇష్టారీతిగా పిడిగుద్దులు కురిపించారు. దెబ్బలకు తాళలేక ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. లాఠీచార్జీ తర్వాత బలవంతంగా కొందరు యువకులను అదుపులోకి తీసుకోవడంతో నిర్వాసితులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో వారిని విడుదల చేయగా నిర్వాసితులు మల్లెచెట్టు చౌరస్తా కు వెళ్లి లో రాస్తారోకోకు దిగడంతో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు హుస్నాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
బంద్‌కు ప్రజల మద్దతు
గుడాటిపల్లి నిర్వాసితులపై పోలీసుల లాఠీ చార్జీ ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మంగళ వారం హుస్నాబాద్ బంద్ ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచి పట్టణంలోని దుకాణాలు మూసి వేసి వ్యాపారులు బంద్‌కు మద్దతు తెలిపారు. కాంగ్రెస్, సిపీఐ నేతలు వేర్వేరుగా బంద్ ను విజయవంతం చేయడం కోసం ర్యాలీ నిర్వహించారు. ప్రశాంతంగా సాగిన హుస్నాబాద్ బంద్ కొద్ది గంటల్లో ముగుస్తుందనగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
టీఆర్ఎస్ పోటీ ర్యాలీతో ఉద్రిక్తం
హుస్నాబాద్ బంద్ సందర్భంగా టీఆర్ఎస్ ర్యాలీ నిర్వహించే ప్రయత్నాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశాంతంగా బంద్ జరగగా వ్యాపార, వాణిజ్య సంస్థలు మూత పడ్డాయి. ఇక కొద్ది గంటల్లో బంద్ ముగుస్తుందని భావిస్తుండగా గౌరవెల్లి ప్రాజెక్టుకు అనుకూలంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీ తీస్తున్నట్లు సోషల్ మీడియాలో మెసేజ్ లు వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న నిర్వాసితులు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు రోడ్డుపై బైఠాయించారు. తమకు జరిగిన అన్యాయంపై పోరాడుతుంటే మీరు ఇలా ర్యాలీ తీయడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తూ రోడ్డుపై కూర్చున్నారు. టీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు సాయంత్రం ఐదు గంటలకు ర్యాలీని ప్రారంభించారు. నిర్వాసితులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితి అదుపు చేస్తుండగా గుంపులోంచి విసిరిన రాయి ఏసీపీ సతీశ్‌కు తగిలింది. దీంతో పోలీసులు నిర్వాసితులపై విరుచుకుపడ్డారు. ఒకవైపు పోలీసులు నిర్వాసితులపై లాఠీ చార్జీ చేస్తుండగా టీఆర్ఎస్ నేతలు ర్యాలీ నిర్వహించడం గమనార్హం.
పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన నిర్వాసితులు
లాఠీచార్జీ చేసి కొందరిని అదుపులోకి తీసుకోవడంతో నిర్వాసితులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ గేటు వద్ద తోపులాట జరిగింది. దీంతో అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు విడుదల చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ విడుదలైన వారిని తీసుకొని వెళ్లి మల్లెచెట్టు చౌరస్తాలో రాస్తారోకోకు దిగారు. స్పాట్‌కు చేరుకున్న సీపీ ఎన్.శ్వేత వారితో మాట్లాడారు. రాస్తారోకోతో మీకు న్యాయం జరగదు, మీ డిమాండ్లు సాధించుకోవాలంటే శాంతియుతంగా అధికారులతో చర్చలే మార్గమని సూచించి ఆందోళనలో పాల్గొంటున్న మహిలలతో మాట్లాడారు. సీపీ సూచన మేరకు రాత్రి 8 గంటలకు నిర్వాసితులు రాస్తారోకో విరమించి గుడాటిపల్లికి వెళ్లిపొయారు.
ఇయ్యాల గౌరవెల్లిపై ఈఏసీ మీటింగ్
గౌరవెల్లి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. రాష్ట్రం నుంచి ఇరిగేషన్ ఇంజనీర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. గతంలో ప్రాజెక్టు కెపాసిటీ 1.8 టీఎంసీలతో ప్రాజెక్టు డిజైన్ చేయగా దానిని 8.3 టీఎంసీలకు పెంచారు. కెపాసిటీ పెంపు కారణంగా తమపై ప్రభావం పడుతుందని, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించరాదని ముంపు బాధితులు గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈఏసీ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
లాఠీ చార్జీ చేయలేదు
హుస్నాబాద్ బంద్ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా పోలీసులు సంయమనం పాటించి లాఠీచార్జీ చేయలేదు. నిర్వాసితులు కట్టెలు, పైపులు, రాళ్లు పట్టుకుంటే వారి నుంచి లాక్కున్నామే తప్ప కొట్టలేదు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మాత్రం పోలీసులు ఊరుకునే ప్రసక్తే వుండదు. అడిషనల్ కలెక్టర్ పరిహారాల విషయంపై మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారని సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నిర్వాసితులకు సూచించడంతో రాస్తారోకో విరమించారు.
- ఎన్. శ్వేత, సీపీ