
- పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళి
మహబూబ్ నగర్ అర్బన్/నాగర్‌కర్నూల్‌టౌన్/ వనపర్తి/గద్వాల/ఇటిక్యాల, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వివిధ ఘటనల్లో చనిపోయిన 191 మంది పోలీసులను స్మరించుకొని, వారికి నివాళులు అర్పించారు. మహబూబ్‌నగర్ పరేడ్ గ్రౌండ్లో ఎస్పీ డి జానకి ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ లో జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ర్యాలీని డీఐజీ జెండా ఊపి ప్రారంభించారు. హెడ్ క్వార్టర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఓల్డ్ బస్టాండ్, క్లాక్ టవర్ చౌరస్తా, రాంమందిర్ చౌరస్తా, లైబ్రరీ మీదుగా పరదేశి నాయుడు సర్కిల్ వరకు కొనసాగింది.
అనంతరం దివంగత ఎస్పీ పరదేశీ నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఐజీ, ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసుల త్యాగం వల్ల సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొందని తెలిపారు. పోలీస్ అమరవీరుల త్యాగం మరువలేనిదన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబసభ్యులు, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, అడిషనల్ ఎస్పీలు ఎన్బీ రత్నం, సురేశ్ కుమార్, జైల్ సూపరింటెండెంట్ వెంకటేశం పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్లో..
విధి నిర్వహణలో సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ అమరులైన పోలీసులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. నాగర్ కర్నూల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన స్మృతి పరేడ్‌లో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో కలిసి పాల్గొన్నారు. విపత్తులు, పండుగలు, ఎన్నికల్లో పోలీసులు ముందుండి సేవలు అందిస్తున్నారని, ఆధునిక సాంకేతికతను వినియోగించి నేరాలను సమర్థవంతంగా ఛేదిస్తున్నారని అభినందించారు. పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పోలీసు శాఖ కృషి చేస్తోందని తెలిపారు.
వనపర్తిలో..
అసాంఘిక శక్తులతో పోరాడి అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. వనపర్తి పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అమర పోలీసులకు నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబసభ్యులతో సమావేశమై వారి సమస్యలు, సంక్షేమంపై చర్చించారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏఆర్ ఏఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
గద్వాలలో..
విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయమని జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన స్మృతి పరేడ్‌లో ఎస్పీ శ్రీనివాస్‌రావుతో కలిసి పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ఈ ఏడాది దేశవ్యాప్తంగా వివిధ ఘటనల్లో మరణించిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అడిషనల్ ఎస్పీ శంకర్ చదివి వినిపించారు. అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితరులు స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఓపెన్ హౌస్ ను పరిశీలించిన అనంతరం బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను ప్రారంభించారు. పలువురు పోలీసులు, యువకులు రక్తదానం చేశారు.
10వ బెటాలియన్ లో..
ఇటిక్యాలలోని 10వ బెటాలియన్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. బెటాలియన్ కమాండెంట్ జయరాజు పోలీసులు, వారి కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. అమరులైన పోలీసుల త్యాగాలు స్ఫూర్తిని కలుగజేస్తాయని, కర్తవ్యాన్ని మనకు గుర్తు చేస్తాయని తెలిపారు.
నారాయణపేటలో..
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. స్థానిక పరేడ్ గ్రౌండ్లో స్మృతి పరేడ్‌లో ఎస్పీ వినీత్‌తో కలిసి పాల్గొని పోలీస్ అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఏఎస్పీ ఎండీ రియాజ్ ఉల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య పాల్గొన్నారు.