సంస్మరణే కాదు,.. సంస్కరణా కావాలి

సంస్మరణే కాదు,.. సంస్కరణా కావాలి

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులను ప్రతి సంవత్సరం అక్టోబర్‌‌ 21 నాడు దేశ మంతటా సంస్మరించుకోవటం ఆనవాయితీగా వస్తున్న ఒక పవిత్ర సంప్రదాయంగా భావించాలి. నిజానికి పోలీసుల సేవలు వెలకట్టలేనటువంటివి. ఎండనకా, వాననకా, పండగ పబ్బాలను మరిచి ఇరవై నాలుగు గంటలూ విధి నిర్వహణలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. 1959లో  పదిమంది సీఆర్పీఎఫ్​ పోలీసులు లడక్‌‌ ప్రాంతంలోని అక్సాయ్‌‌చిన్‌‌ దగ్గర చైనీయుల దాడిలో ఆరోజు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి పోలీసు అమరుల సంస్మరణ దినంగా దేశంలో పాటించటం
జరుగుతున్నది..

బ్రి టిష్‌‌ వారు మన దేశాన్ని వలస రాజ్యంగా పాలించినప్పుడు ఏర్పరిచిన పోలీసు వ్యవస్థకు, స్వాతంత్య్రానంతరం కేంద్రంలోనూ, రాష్ట్రాలలోను నిర్మించుకున్న పోలీసు వ్యవస్థలకు ఉన్న తేడా లేమిటి?  అని.. ఈ సందర్భంగా మనం బేరీజు వేసుకోవటం అవసరమని ఎన్నోసార్లు పోలీసు వృత్తిలోని నిపుణులు, స్వతంత్ర విశ్లేషకులూ భావించారు. 1861 పోలీసు యాక్ట్‌‌, 1935 పోలీసు యాక్ట్‌‌ రూపాంతరం చెందినా ఇప్పటికీ ఆ చట్టాలననుసరించే వృత్తిపరంగా పోలీసులు పనిచేయక తప్పటం లేదు. కొన్ని రాష్ట్రాలు స్వతంత్రంగా పోలీసు యాక్ట్​లు తెచ్చుకొని అమలుపర్చుకుంటున్నా - నిజమైన మార్పు పోలీసుల వృత్తి ధర్మంలో, విధి నిర్వహణలో దేశమంతా తేలేకపోవటం దురదృష్టకరం. ప్రభుత్వాల్లోకి వస్తున్న రాజకీయ నాయకుల రూపంలోని పాలకులు పోలీసులను తాబేదార్లుగా వినియోగించుకోవటానికి ఇష్టపడుతుండటం ఈ స్వాతంత్ర్య దేశంలో అభ్యంతరకరంగా సగటు మనిషి భావించటం లేదు. పోలీసులు చట్టానికి, రాజ్యాంగానికే బాధ్యులు కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్నవారికి అన్నివేళలా బాధ్యులు కారన్న విషయాన్ని విస్మరిస్తున్నారు.

సంస్కరణల జాడలేదు

పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా పోలీసు సంస్కరణలు అవసరమని ప్రతి ప్రభుత్వం మాట వరుసకు అనటమే కానీ సంస్కరణలు అమలుపరిచిన దాఖలాలు లేవు. ఎన్నో కమిటీలు, కమిషన్లు టన్నుల కొద్దీ రికమండేషన్లు ప్రతిపాదించాయి. కానీ, ఏ ప్రభుత్వమూ ఆ దస్త్రాలు విప్పిన దాఖలాలు లేవు. మతకల్లోలాలప్పుడో, ఉగ్రవాదం, తీవ్రవాదం పెచ్చరిల్లినప్పుడో పోలీసు సంస్కరణలు విధాయకంగా గుర్తుకు వస్తాయి. పని గంటల విషయంలో ఇంతవరకూ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని ప్రభుత్వాలు, పని ఒత్తిడిని తగ్గించటానికి ఒక ప్రణాళికను రచించలేని ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలో యూనిటీ ఆఫ్‌‌ కమాండ్‌‌, హైరార్కీ, స్పాన్‌‌ ఆఫ్‌‌ కంట్రోల్‌‌ ఉండక తప్పదు అని పైపైన చెప్పటమే కానీ ఇంతవరకూ ఆచరించలేక పోతున్నాయి.

సిస్టమ్​ కాదు వ్యక్తులు పనిచేస్తున్నారు

ఇంగ్లండ్​లో చీఫ్‌‌ కానిస్టేబుల్‌‌ డీజీపీ హోదాకు సమానం. ఆయన తాపీగా విధి నిర్వహిస్తున్న   ధోరణిని గమనించి - ‘ఇదేమిటి? మా దేశంలో డీజీపీ విపరీతమైన ఒత్తిడిలో పనిచేస్తారు - మీరు పనే లేనట్లు తాపీగా ఉన్నారు’ అని అడిగినప్పుడు - ‘మీ దేశంలో వ్యక్తులు పనిచేస్తారు. ఇక్కడ సిస్టమ్‌‌ పనిచేస్తుంది.అదీ తేడా’ అని చెప్పి కనువిప్పు కలిగించారు. ‘మీ దేశాన్ని పాలించినప్పుడు మాకు అనువైన రీతిలో పోలీసు వ్యవస్థను నిర్మించుకున్నాం. స్వాతంత్ర్య దేశంగా మారినప్పుడు మీకు అక్కరకు వచ్చే అనువైన రీతిలో వ్యవస్థను ఎందుకు నిర్మించుకోలేదు’ అని అడిగిన ఆ చీఫ్‌‌ కానిస్టేబుల్‌‌ సూటి ప్రశ్నకు సమాధానం లేదు. మన దేశంలో పోలీసు స్టేట్‌‌ సబ్జెక్ట్‌‌. కానీ, తెలిసీ తెలియని రీతిలో అనేక కారణాల వల్ల కేంద్రం జోక్యం చేసుకుంటున్నది. మొదటి సంస్కరణ అక్కడ మొదలవ్వాలి. పోలీసు వ్యవస్థను ప్రజలకు మేలుచేసే రీతిలో ఏవిధంగా మల్చుకోవాలి అన్న విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇన్ని సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా స్పష్టత ఉన్నట్లు వ్యవహరించటం లేదు. ఇష్టాయిష్టాలననుసరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు శాఖల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సఖ్యత ఉన్నప్పుడు ఏ పెద్ద తప్పు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వల్ల జరిగినా, చూడనట్లు ఉండటం కేంద్రం అలవర్చుకున్నది. అనైక్యత ఉన్నప్పుడు చిన్న పొరపాటు చాలు శాంతి భద్రతల భూతాన్ని పోలీసులకు ఆపాదించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మింగేయటానికి.
ఇంగ్లండ్‌‌లోని కౌంటీ పోలీసు, ఫ్రాన్స్​లోని ప్రిఫెక్ట్‌‌ లాంటి లోకల్‌‌ వ్యవస్థలకు మన రాష్ట్రాలలోని పోలీసు శాఖలకన్నా స్వతంత్రంగా వ్యవహరించే ప్రతిపత్తి  కల్పించారు. అయినంతమాత్రాన మూర్ఖంగా  వాటినే అనుసరించాల్సిన అవసరం మనకు లేదు.

ఈ సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఇప్పటికైనా జవసత్వాలున్న పోలీసు వ్యవస్థలను రాష్ట్రాల్లో నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. మూలన పడేసిన సంస్కరణలను బయటకు తీయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. వాటిని అటకమీద ఉంచే కొన్ని ఆచరణాత్మక మార్గదర్శకాలను ప్రభుత్వాలు ఆచరిస్తే చాలు. పోలీసు వ్యవస్థ సంపూర్ణమైన ఫలితాలను అందిస్తుంది. పోలీసులు చట్టానికి జవాబుదారీ. అందుకోసం ప్రత్యేకంగా సంస్కరణ రూపంలో ఏదీ తలపెట్టాల్సిన పనిలేదు. - రాజ్యాంగం ప్రకారం పోలీసులు ఆ విధంగా నడుచుకోక తప్పదు. ప్రభుత్వాలు ఆ విధంగా విధి నిర్వహణ చేసేటట్లు ప్రోత్సహించాలి. కానిస్టేబుల్‌‌ను లెక్కపెట్టకపోయినా అవసరమొస్తే కానిస్టేబుల్‌‌కు అధినేతకైనా చుక్కలు చూపించే అధికారం ఉంది. ఎవరినైనా 24 గంటలు నిర్బంధించే అధికారం పోలీసుకు ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని ఆ పోస్టుకు విధాయకంగా ఇవ్వాలి.హోదాను ఇతరులు గౌరవించినప్పుడు తనను తాను గౌరవ ప్రదంగా మల్చుకొనే స్థితి సహజంగానే పోలీసుకు అబ్బుతుంది. క్లాస్‌‌ ఫోర్‌‌ స్థాయి నుంచి హోదాలో, జీతంలో ఈ మధ్య కానిస్టేబుల్‌‌ వ్యవస్థను మెరుగుపర్చినా, నిజమైన స్థానం సమాజంలో దక్కినప్పుడే పోలీసులను గౌరవించటం ప్రజలకు అలవడుతుంది. అది జరిగిన నాడు చాలా సహజంగా, ఇతర దేశాల్లో మాదిరి పోలీసులు తమ హితులు, శ్రేయోభిలాషులు అని ప్రజలు భావిస్తారు. వ్యక్తికీ, సమాజానికీ రక్షణ బాధ్యత వహించేది పోలీసు అయినప్పుడు అతనికి ఏ పాటి విలువను ఈ పాలకులూ, - అధికారులు బహిర్గతంగా ఇవ్వగలుగుతున్నారనేది లోతుగా ఆలోచించాల్సిన విషయం.
 
గోరే కమిటీ, రెబెరో కమిటీ, పద్మనాభయ్య కమిటీ, మలీమత్‌‌ కమిటీ - రిటైర్డ్‌‌ పోలీసు ఆఫీసర్‌‌ ప్రకాష్‌‌ సింగ్‌‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా తెచ్చిన తీర్పులోని మార్గదర్శకాలు.. - ఏదీ సంస్కరణల దశను దాటి రాలేనప్పుడు కొన్ని చిన్న సంస్కరణలైనా ప్రభుత్వాలు చేపడితే సమాజానికి పోలీసు అమరుల త్యాగం వృథా పోదు. పనికి తగ్గ వేతనాలు,  గృహ సౌకర్యం, ఆరోగ్య భద్రతలాంటి చర్యలు అరకొరగా తీసుకోకుండా సంతృప్తికర విధానం అమలుచేయాలి. పోలీసుల ముఖ్యమైన విధులు నేర పరిశోధన, నేర నిరోధనతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ. ఈ ముఖ్యమైన విధులు నెరవేర్చటానికి హెచ్చుస్థాయిలో సిబ్బంది  అవసరం. హెడ్‌‌  హెవీ అయి, శరీరం బలహీనంగా ఉన్న పరిస్థితి ప్రస్తుత పోలీసు వ్యవస్థ స్థితి. రకరకాల బందోబస్తులకు - ప్రత్యేక బందోబస్తు దళాల రిక్రూట్‌‌మెంట్‌‌ను చేసుకోవాలి. - పరిశోధన  చేసే పోలీసులను ఇతర పనులకు వినియోగించుకోకూడదు.

సెక్యూరిటీ పేరుతో హెచ్చుసంఖ్యలో వినియోగించబడుతున్నప్పుడు నామమాత్రంగా మిగిలిన పోలీసులే అసలైన డ్యూటీలకు అందుబాటులో ఉండే దైన్య స్థితిలో పోలీస్​ డిపార్టుమెంట్‌‌ పనిచేస్తున్నది. బౌన్సర్లను విరివిగా ప్రయివేట్‌‌ వ్యక్తులు వినియోగించుకుంటున్న  ఈ రోజుల్లో అందరికీ సెక్యూరిటీ పేరుతో పోలీసులను వినియోగించాల్సిన అవసరం లేదు. భద్రత వ్యక్తిగతం. సామాజికపరమైన బాధ్యత పోలీసు శాఖ వహించటమనేది ఒక రూల్‌‌గా - ప్రభుత్వం విఐపీలకీ భద్రత పేరుతో గన్‌‌మెన్‌‌లను ఇవ్వటం ఒక ఎక్సెప్షన్‌‌గా మారాలి. ఒకవేళ ఇచ్చినా ఖర్చులు వారి దగ్గరి నుంచి వసూలు చేయక తప్పదు. థ్రెట్‌‌ పర్‌‌సెప్షన్‌‌ మీటింగ్‌‌లు ప్రభుత్వం పేరుకే చేస్తున్నది కానీ నిజమైన భద్రత, ఎవరికి అవసరమన్నది నిర్ణయించటంలో విఫలమవుతున్నది. ఈ ‘థ్రెట్‌‌’ అంచనా కచ్చితంగా వేస్తే సగానికి సగం సిబ్బంది గన్‌‌మెన్‌‌ల డ్యూటీ నుంచి విముక్తులవుతారు. ఆ చర్య ప్రభుత్వాలు చేస్తే బాగుంటుంది.

ముఖ్యమంత్రి డీజీపీ కాకూడదు!

చాలా సంవత్సరాల కిందట ఒక ఎస్పీని హోంమినిస్టర్​ క్రైమ్​ మీటింగ్‌‌ పెట్టండి . నేను జిల్లా పోలీసులకు కొన్ని మార్గదర్శకాలు ఇవ్వాలి అని చెప్పినప్పుడు..క్రైమ్​7 మీటింగ్‌‌ అవసరం లేదుసార్. నేను జిల్లా ప్రధానాధికారిని, నాకు చెప్పండి .నేను అమలుపరుస్తాను. అని వినయంగా, ధైర్యంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రజాస్వా మ్యంలో ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాల నిర్ణయాలు కచ్చితంగా ఆచరించక తప్పదు. కానీ,  అమలు పరచటానికి రాజ్యాంగం ఏర్పరిచిన పరిధులను కాదని ప్రభుత్వం ఏదీ చేయగూడదు. అది వారి పనికాదు. విభేదించినప్పుడు  నిర్ణయాలు అమలుపర్చటంలో లోపాలు ఉన్న ప్పుడు చర్యలు తీసుకొని వ్యవస్థలను గాడిలో పెట్టటమే వారి పని. మినిస్టర్​.. పోలీసు కాకూడదు. ముఖ్యమంత్రి డీజీపీ బాధ్యతలు నిర్వహిం చగూడదు. పోలీసు వృత్తిలో కాఠిన్య తతో పాటు మానవత్వం మేళవిం చినప్పుడే ప్రజలకు మేలు చేకూరుతుంది.

స్సెషల్​ రిక్రూట్​మెంట్​ చేపట్టాలి

స్పెషల్‌‌ ప్రొటెక్షన్‌‌ ఫోర్స్‌‌ ,- నేషనల్‌‌ సెక్యూరిటీ గార్డ్స్​ను కేంద్రం ఏర్పాటు చేసుకున్నది. ఆ తరహాలోనే రాష్ట్రాలు ప్రత్యేక రిక్రూట్‌‌మెంట్‌‌ తలపెడితే పోలీసుల అసలు వృత్తికి వెసులుబాటు లభిస్తుంది. ఫ్రెండ్లీ పోలీసు అన్నది కాగితానికే, ఉపన్యాసాలకే పరిమితం కాగూడదు. పాతకాలంలోనే పోలీసు పటేల్‌‌, సేక్‌‌ సిందీ పేరుతో తెలంగాణ  ప్రాంతంలో గ్రామాల్లో ప్రజలతో స్నేహ సంబంధాలను పెంపుచేసే వ్యవస్థలను ప్రోత్సహించి గణనీయంగా ప్రభుత్వాలకు తోడ్పడ్డారు. మైత్రీ సంఘాలు, ప్రజా పోలీసు, - ఫ్రెండ్లీ పోలీసు, - శాంతి కమిటీల్లాంటి వాలంటరీ దళాలను ఏర్పరుచుకుంటే - పోలీసులో ఒక భాగమైన హోంగార్డు వ్యవస్థ మాదిరిగా అందుబాటులో వుంటాయి.మన దేశంలో ఎక్కువశాతం ప్రజలు శాంతిని కోరుకొనేవారే. సాధ్యమైనంత వరకూ పోలీసుల అసలైన వృత్తిలో తల దూర్చనివారే. వారికి పోలీసు స్నేహితుడిగా మారుతే ప్రజలు నెత్తిమీద పెట్టుకుంటారు. సంస్మరణ దినాన్ని హృదయపూర్వకంగా చేసుకోవటమే కాదు, అమర పోలీసుల త్యాగాన్ని స్మరించుకుంటారు. ఆ రోజు కోసం పోలీసులు ఎదురుచూడాలంటే ` వారు మనసులోని మానవత్వాన్ని వృత్తిలో వెలికితీయాలి.

-  రావులపాటి సీతారామరావు, రిటైర్డ్​ ఐపీఎస్​