నిజామాబాద్‌లో జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులు

నిజామాబాద్‌లో జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులు

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: డీసీపీ జయరాం, ఆర్ఐ వెంకటప్ప నాయుడు జర్నలిస్టులను పక్కకు నెట్టేయడంతో జర్నలిస్టులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ విషయమై జర్నలిస్టులు కమిషనర్ కల్మేశ్వర్ కు ఫిర్యాదు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి తనకు ప్రాణహాని ఉందని మంగళవారం సీపీ కల్మేశ్వర్ కు కలవడానికి వచ్చారు. సీపీతో మాట్లాడి బయటకు వస్తున్న పైడి సీపీతో మాట్లాడిన విషయాన్ని జర్నలిస్ట్​లకు వివరిస్తున్నారు. అదే సమయంలో అడిషనల్ సీపీ గిరిరాజ్, ఆర్ఐ వెంకటప్ప నాయుడు జర్నలిస్టులను తోసేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి అక్కడే బైటాయించి పోలీసుల జులూం నశించాలంటూ నినాదాలు చేశారు. మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అనంతరం సీపీ జర్నలిస్టులను తన ఛాంబర్ కు పిలిపించుకొని మాట్లాడారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశారని, ఆ సమయంలో ఎమ్మెల్యే అనుచరులు అరుపులు, నినాదాలు చేయడంతో వారిని కంట్రోల్ చేసేందుకే పోలీసులు అలా ప్రవర్తించారే తప్ప, మరో ఉద్దేశం లేదన్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్​కాకుండా చూస్తానన్నారు.