మానవత్వాన్ని చాటిన ఎస్ఐ

మానవత్వాన్ని చాటిన ఎస్ఐ

హైద‌రాబాద్: లాక్ డౌన్ రూల్స్ ఎంతో క‌ఠినంగా అమ‌లు చేస్తున్న పోలీసులు.. అవ‌స‌ర‌మైతే మంచి ప‌నులు కూడా చేస్తే అంద‌రి చేత భేష్ అనిపించుకుంటున్నారు. సోమ‌వారం లాక్ డౌన్ వ‌ల్ల మ‌ధ్య‌లోనే చిక్కిపోయిన‌ ఇద్ద‌రు యువ‌తుల‌ను సొంతూరుకు వెళ్లేందుకు వాహ‌న సౌక‌ర్యం క‌ల్పించి మంచి మ‌న‌సు చాటుకున్నారు.  ఉట్నూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు హైదరాబాద్ నుండి ఉట్నూర్ వెళ్లేందుకు సోమ‌వారం ఉద‌యం బ‌య‌లుదేరారు. లక్షెట్టిపేట్ వరకు రాగానే లాక్ డౌన్ సమయం 10 దాటింది. ల‌క్షెట్టిపేట్ లో ఆగిపోయిన యువ‌తులు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. ఉట్నూర్ వెళ్లడానికి రవాణా సౌకర్యం లేనందున లక్షెట్టిపేట్ చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ చంద్ర శేఖర్, PSI హైమాలు వారి పరిస్థితి గమనించారు.

వెంటనే ఆదిలాబాద్ వైపు వెళ్తున్న కారును ఆపి అందులో ఇద్ద‌రు యువతులను ఎక్కించి వారి యొక్క గ్రామానికి పంపించారు. ఇద్ద‌రి అమ్మాయిల‌ ఫోన్ నెంబ‌ర్లు తీసుకుని..కారు న‌డిపేవారి మొబైల్, కారు నెంబ‌ర్లు కూడా తీసుకుని జాగ్ర‌త్త‌గా వారి ఊరిలో దించ‌మ‌ని చెప్పారు. లాక్ డౌన్ లో  సేఫ్ గా ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించినందుకు పోలీసుల‌కు థాంక్స్ తెలిపారు యువ‌తులు. ఒంట‌రి యువ‌తుల‌కు రవాణా సౌకర్యం కల్పించినందుకు పోలీసుల‌ను అభినందించారు ఉన్న‌తాధికారులు.