దెసా అడవుల్లో టెర్రరిస్టుల వేట

దెసా అడవుల్లో టెర్రరిస్టుల వేట
  • జమ్మూకాశ్మీర్ లో కొనసాగుతున్న భద్రతా బలగాల గాలింపు
  • తప్పించుకు పారిపోయిన జైషే  మిలిటెంట్లు
  • రంగంలోకి పారా కమాండోలు
  • డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో సెర్చింగ్

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. దెసా ఫారెస్ట్​ను రాష్ట్రీయ రైఫిల్, జమ్మూ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ జల్లెడపడుతున్నాయి. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో దెస్సా ఫారెస్ట్ ఏరియాలోని కలాన్ భాటా వద్ద టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. తర్వాత మంగళవారం అర్ధారాత్రి దాటాక 2 గంటల సమయంలో పంచాన్​ భాటా వద్ద కూడా ఫైరింగ్ జరిగింది.

ఈ రెండు ఘటనల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. ఎన్​కౌంటర్ తర్వాత పారిపోయిన టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. కాగా, విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ (వీడీజీ) రంగంలోకి దిగాయి. గండోహ్ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిపై వీడీజీ కాల్పులు జరిపింది. దట్టమైన అటవీ ప్రాంతం

చీకటిని ఆసరా చేసుకుని భద్రతాబలగాలపై టెర్రరిస్టులు కాల్పులు జరుపుతున్నారు. సెర్చ్ ఆపరేషన్​కు అక్కడి వాతావరణం సహకరించకపోతున్నా.. బలగాలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి.

అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్పులే..

దట్టమైన దెసా అటవీ ప్రాంతంలో దాక్కున్న టెర్రరిస్టులు.. పాకిస్తాన్​కు చెందిన జైషే మహ్మద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్​కు చెందినవారని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో పారా కామాండోలు కూడా టెర్రరిస్టుల కోసం సెర్చ్ చేస్తున్నారు. డ్రోన్లు, అత్యాధునిక సాంకేతిక పరికరాలను వాడుతున్నారు.   

జమ్మూ రీజియన్​లో నిరసనలు

నలుగురు ఆర్మీ జవాన్లను టెర్రరిస్టులు చంపడాన్ని నిరసిస్తూ జమ్మూ రీజియన్​లో బుధవారం పలుచోట్ల ప్రజలు నిరసన తెలియజేశారు. టెర్రరిస్టుల ఏరివేతకు ఆపరేషన్ ఆల్ ఔట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రీయ బజరంగ్ దళ్ చీఫ్ రాకేశ్ కుమార్ నేతృత్వంలో పలువురు సభ్యులు పాకిస్తాన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టెర్రరిస్టులకు పాక్ అండగా ఉన్నదని ఫైర్ అయ్యారు. ఆ దేశ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఇండియన్ గవర్నమెంట్ స్పందించి.. ఆపరేషన్ ఆల్ ఔట్ లాంచ్ చేపట్టాలన్నారు.