పెళ్లికి వేదికగా పోలీస్ స్టేషన్

పెళ్లికి వేదికగా పోలీస్ స్టేషన్

సాయం చేసిన పోలీసులు
లాక్ డౌన్ లోనూ ఒక్కటైన జంట
లక్నో: లాక్ డౌన్ కారణంగా ఆగాల్సిన ఓ పెళ్లి పోలీసుల సహకారంతో పోలీస్ స్టేషన్ లోనే జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని చందౌలీ జిల్లా మహుజీ గ్రామానికి చెందిన అనిల్, ఘాజీపూర్ జిల్లాకు చెందిన జ్యోతి పెళ్లి దీనా పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఈనెల 20న వీరి పెళ్లి చేయాలని పెద్దలు ముందే నిర్ణయించారు. అయితే లాక్ డౌన్ కారణంగా పెళ్లి జరుగుతుందా లేదా అనేది సందేహంగా మారింది. వెంటనే అనిల్ పోలీసులను సంప్రదించాడు. ఫిబ్రవరిలో జరిగిన ఓ బోటు ప్రమాద ఘటన టైమ్ లో అనిల్ పోలీసులకు సాయం చేశాడు. బోటులో ప్రయాణిస్తున్న చాలా మంది ప్రాణాలను కాపాడటంతో పోలీసు అధికారులు అనిల్ ను మెచ్చుకున్నారు. పెళ్లి గురించి అనిల్ అడగ్గానే పోలీసులు సాయం చేయడానికి ఒప్పుకున్నారు. అయితే పెళ్లికి వధువు, వరుడు తరఫున పది కంటే ఎక్కువ మంది హాజరుకావొద్దని చెప్పారు. ‘మా స్టేషన్ కాంపౌండ్ లోపల ఉన్న శివాలయంలో అనిల్ పెళ్లి చేసుకున్నాడు. సోషల్ డిస్టెన్స్ ను స్ట్రిక్ట్ గా పాటిస్తూ.. లిమిటెడ్ పర్సన్స్ మధ్య ఈ వివాహం జరిగింది’ అని ఒక పోలీసు అధికారి చెప్పారు.