కాళేశ్వరం విజిట్కు బయల్దేరిన ఆకునూరి మురళి

కాళేశ్వరం విజిట్కు బయల్దేరిన ఆకునూరి మురళి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు బయలుదేరిన రిటైర్డు ఐఏఎస్, మాజీ కలెక్టర్ ఆకునూరి మురళిని పోలీసులు అడ్డుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపుహౌస్ కు చాలా దూరంలోనే నిలిపేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పంపు హౌస్ లు వరద గోదావరిలో నీట మునిగిన విషయం తెలిసిందే. గురువారం వరద గోదావరిలో పంప్ హౌస్ లు నీట మునిగిపోవడం వెనుక దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు బయటకొచ్చాయి. మూడేండ్లకే ఫోర్‌‌‌‌ బేస్​మెంట్‌‌‌‌ గోడలు పగిలిపోవడం..సుమారు రూ.680 కోట్ల విలువైన 17 బాహుబలి మోటార్లు నీట మునగడానికి నాసిరకమైన పనులే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. 

ముఖ్యంగా వందల ఏండ్లపాటు ఉండాల్సిన ఫోర్ బేస్ మెంట్ గోడ మూడేండ్లకే పగలడం వల్ల పంప్ హౌస్ లోకి నీళ్లు చొచ్చుకుని రావడంతో రూ. వందల కోట్ల విలువ చేసే పంపింగ్‌‌‌‌, ఎలక్ట్రిక్​ సామగ్రి నీళ్లపాలయ్యాయి. విదేశాల నుంచి వచ్చే ఇంజనీర్లే ఈ మోటార్లను రిపేర్​ చేయాల్సి ఉందని, ఇందుకు ఎంత లేదన్నా 6 నెలలు పడ్తుందని ఇరిగేషన్​ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఏడాదీ కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్​  వద్ద నీటి పంపింగ్‌‌‌‌ ఆగినట్లేనని, కనీసం ఆర్నెల్ల పాటు ఆగనున్న పంపింగ్‌‌‌ ఆగిపోయే పరిస్థితి ఉందని.. మరమ్మతులన్నీ విదేశీ ఇంజినీర్లతోనే చేయించాల్సి వస్తుందని.. కనీసం ఎంత లేదన్నా రూ. 400 కోట్లకు పైగా ఖర్చు అయితదని ఇంజనీర్లు అంచనా వేసిన విషయం బయటకు రావడం చర్చనీయాంశం అయింది.  
ఈ నేపథ్యంలో వాస్తవాలు నిర్ధారణ కావాలంటే ముందుగా ప్రాజెక్టులు సందర్శించాలని బయల్దేరిన ఆకునూరి మురళిని పోలీసులు అడ్డుకున్నారు. వరద ఉధృతి దృష్ట్యా ఎవరినీ అనుమతించడం లేదని తెలుపగా .. ఎవరిచ్చారు ఉత్తర్వులు అంటూ ప్రశ్నించారు.  డీఈ పంపిన ఉత్తర్వులను పోలీసులు చూపగా.. అలా నిషేధించే అధికారం ఆయనకెక్కడిది.. కనీసం ఆర్డీవో స్థాయి అధికారైనా ఇవ్వాలిగా.. అన్నారు.