బిగ్ బాస్ షో షూటింగ్ నిలిపేసిన పోలీసులు

 బిగ్ బాస్ షో షూటింగ్ నిలిపేసిన పోలీసులు

చెన్నై: మళయాళ బిగ్ బాస్ 3 సీజన్ షూటింగ్ ను తమిళనాడు పోలీసులు అడ్డుకుని నిలిపివేశారు. ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్ వ్యాఖ్యాతగా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు షూటింగ్ స్పాట్ కు చేరుకున్నారు.  చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్​సిటీలో ఈ షోకు సంబంధించిన షూటింగ్ ​జరుగుతున్నట్లు గుర్తించిన షూటింగ్‌ ఆపేయాలని సూచించారు. వైద్య బృందాలను పిలిపించి వారి ఆధ్వర్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ షోలో పాల్గొంటున్నవారందరినీ ఓ హోటల్‌కు తరలించారు. వైద్య బృందం ఆధ్వర్యంలో షోలో పాల్గొన్న సిబ్బందికి పరీక్షలు చేయగా వారిలో ఆరుగురికి కరోనా సోకినట్లు వార్తలు కూడా వచ్చాయి. 
తమిళనాట కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో సంఘీభావం ప్రకటించిన తమిళ పరిశ్రమ కూడా పూర్తిగా షట్ డౌన్ ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు తమిళనాడులో సినీ, టివీ పరిశ్రమలకు సంబంధించి అన్ని పనులను నిలిపివేస్తున్నామని  ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు (FEFC)  ఆర్ కె సెల్వమణి మీడియా ముఖంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మళయాళ బిగ్ బాస్ షో 94 రోజులుగా ప్రసారం అవుతున్న నేపధ్యంలో షూటింగ్ కు పార్టిసిపెంట్స్ ను పిలిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. సెట్లో పరిస్థితి అదేవిధంగా ఉండడంతో పోలీసులు అడ్డుకుని అక్కడ పనులు చేసుకుంటున్న వారిని ఒక హోటల్ కు తరలించారు. పోలీసుల రాక.. సిబ్బందికి పరీక్షలు నిర్వహించడంపై స్పందించిన షో నిర్వాహకులు తాము షూటింగ్‌ నిర్వహించడం లేదని తెలిపారు. ప్రస్తుతానికి షూటింగ్‌ ఆపేశామని, కరోనా తగ్గిన తరవాత షో ప్రారంభిస్తామని ఛానల్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కన్నడ నటుడు సుదీప్‌ వ్యాఖ్యాతగా వస్తున్న బిగ్‌బాస్‌ 8 కూడా కరోనా కారణంగా మధ్యలోనే ఆపేశారు.