పోలీసుల తనిఖీల్లో..భారీగా డబ్బు సీజ్

పోలీసుల తనిఖీల్లో..భారీగా డబ్బు సీజ్

మేడిపల్లి/మెహిదీపట్నం/ఇబ్రహీంపట్నం/వికారాబాద్ వెలుగు : ఎన్నికల కోడ్ నేపథ్యంలో సిటీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. మంగళవారం వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో భారీగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు.  

  •  చెంగిచర్లలోని ఐవోసీ బస్టాప్ వద్ద మేడిపల్లి, మల్కాజిగిరి ఎస్​వోటీ పోలీసులు  తనిఖీలు చేపట్టారు. ఈస్ట్ మారేడ్ పల్లికి చెందిన మహ్మద్ ఉమర్(50) అనే వ్యక్తి కారును అడ్డుకుని చెక్ చేశారు. రూ.6 లక్షలను గుర్తించారు.  ఆ డబ్బుకు సంబంధించి ఉమర్ ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేశారు. క్యాష్ తో పాటు కారు, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 50 వేలకు మించి డబ్బు తీసుకెళ్తున్నట్లయితే సరైన ఆధారాలు చూపించాలని లేకపోతే వాటిని సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామని సీఐ సైదులు తెలిపారు.  
  •  ఆసిఫ్​నగర్ పీఎస్ పరిధిలోని మిరాజ్ చౌరస్తా వద్ద  ఓ వెహికల్​ను తనిఖీ చేసిన పోలీసులు రూ.6 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. 
  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారత్ గార్డెన్స్ వద్ద మంచాల గ్రామానికి వెళ్లే దారిలో పోలీసులు వెహికల్ చెకింగ్ చేపట్టారు. ఓ ఆటోను ఆపి తనిఖీ చేయగా.. రూ.6 లక్షల 55 వేల డబ్బు పట్టుబడింది. ఆ డబ్బును తీసుకెళ్తున్న ఆరుట్ల గ్రామానికి చెందిన కాసుల సురేశ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో డబ్బును ఎన్నికల అధికారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. 
  • ఆసిఫ్​నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ మోహిత్ కారులో తాండూరు వైపు వెళ్తున్నాడు. వికారాబాద్​లో అతడి కారును తనిఖీ చేసిన పోలీసులు రూ.9 లక్షల 50 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తాన్ని సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు.